పప్పుచారూ కరువే!

Dec 10,2023 21:11

ప్రజాశక్తి – కురుపాం  :  మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నా.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు అధికారులు, ప్రభుత్వం తీసుకోవడం లేదు. తెల్లకార్డుదారులకు రాయితీపై అందించే కందిపప్పు గత నాలుగు నెలలుగా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నాలుగు నెలలకు సంబంధించి కందిపప్పు నేటికీ సరఫరా కాలేదు. రాయితీపై నాలుగు నెలల సరకు అందుతుందని కార్డుదారులు ఎదురుచూశారు. కానీ సెప్టెంబర్‌ ఒకటి నుంచి పేదలకు అందించే రేషన్‌ సరకుల్లో కందిపప్పు లేదని అధికారులే చెబుతున్నారు. దీంతో పేదలు పప్పు బువ్వకు కూడా నోచుకోక పచ్చళ్లతో కాలం గడపవలసి వస్తుందని కంటనీరు పెడుతున్నారు. అసలే కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు జీవనం సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాయితీపై అందించే సరకుల కోసం ఆశతో ఎదురుచూస్తున్న లబ్దిదారులకు నిరాశే మిగులుతోంది. దీనికి తోడు ప్రభుత్వం పేదలకు అందించాల్సిన రేషన్‌ సరకుల్లో ఒక్కొక్కటిగా తగ్గిస్తోంది. నాలుగు నెలలుగా కందిపప్పు పంపిణీ చేయలేదు. ఈ నెలలో కూడా కందిపప్పు ఇవ్వడం లేదు. కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు.మండల మొత్తంగా 11 ఎండియు వాహనాలున్నాయి. వీటి పరిధిలో 14360 (కొత్త కార్డులతో కలిపి) బియ్యం కార్డులు న్నాయి. ఆయా కుటుంబాలకు ప్రతినెలా బియ్యంతోపాటు అరకిలో పంచదార, కిలో కందిపప్పును ప్రభుత్వం రాయితీపై అందించాల్సి ఉంది. ప్రతినెలా కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉంది. రాయితీపై ప్రతి కార్డుకు రూ.67 చొప్పున అందించేది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో దీని ధర రకాన్ని బట్టి రూ.130 నుంచి రూ.180 వరకు ఉంది. నాలుగు నెలల నుంచి కందిపప్పు సరఫరా చేయడం లేదు. రెండు నెలలుగా 50 శాతం ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ అది కూడా కొంతమందికే అందుతోంది.

పప్పును మరిచిపోయాం

గతంలో ప్రతినెలా కందిపప్పు పంపిణీ చేసేవారు. దీంతో వారంలో రెండు రోజులైనా పప్పుచారు చేసుకునేటోళ్లం. తీరా నాలుగు నెలల నుంచి కందిపప్పు పంపిణీ చేయడమే ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పప్పుచారు చేసుకోవడమే మానుకున్నాం

.-ఎం. శ్రీనివాస్‌, బొడ్లగూడ

బయట కొనలేకపోతున్నాం

రేషన్‌ షాపుల్లో రూ.67కు కిలో కందిపప్పు సరఫరా చేసేవాళ్లు. ప్రస్తుతం సరఫరా నిలిపివేయడంతో కందిపప్పు ధర బయట మార్కెట్లో రూ.160 వరకు పలుకుతోంది. అసలే పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు అంత ధర పెట్టి కందిపప్పు కొనుగోలు చేయడం కష్టంగా మారుతోంది.

– టి.శంకరరావు, పెదగొత్తిలి

ప్రభుత్వం నుంచి వస్తే పంపిణీ చేస్తాం ప్రభుత్వం నుంచి కందిపప్పు నాలుగు నెలలు పూర్తిగా సరఫరా కాలేదు. గత రెండు నెలలుగా 50 శాతం వస్తుండడంతో కొంతమంది కార్డుదారులకు పంపిణీ చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సరఫరా వస్తుంది. ప్రభుత్వం నుంచి కందిపప్పు సరఫరా వచ్చిన వెంటనే లబ్దిదారులకు అందిస్తాం.

– ఎ.సాంబమూర్తి,సివిల్‌ సప్లై డిటి, కురుపాం

➡️