పదేపదే విన్నవించినా చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వం

Feb 15,2024 22:00

నరసరావుపేటలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం మధ్యాహ్న భోజన సమయంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌కు సమీపంలో గల జిల్లా కార్మిక శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సరెండర్‌ లీవులు, జిపిఎఫ్‌ఎ బకాయిలను తక్షణమే చెల్లించాలని, ఐఆర్‌ వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని పెండింగ్‌ డిఎలు ఏరియర్‌ చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంటాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు 12వ పీఆర్సీ, ఐఆర్‌ 30 శాతం అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వం రూ.21 వేల కోట్ల బకాయి పడిందని అన్నారు. 58 నెలలుగా ఓర్పుతో ఎదురు చూశామని, బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించినా చర్చలు జరిపినా చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎపి జెఎసి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ కె.వి శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మేరకు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలన్నారు. గుంటూరు జిల్లా చైర్మన్‌ గంటసాల శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్‌ శెట్టిపల్లి సతీష్‌కుమార్‌, నరసరావుపేట తాలూకా చైర్మన్‌ రామ కృష్ణ, కన్వీనర్‌ ఎం.ఆనంద్‌నాథ్‌, సిహెచ్‌. కోటిరెడ్డి, రవికుమార్‌, రామాంజనరెడ్డి, డివిడి ప్రసాద్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్‌ పాల్గొన్నారు. అమరావతి తహశీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎన్‌జిఒ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు సూరెపల్లి రాజశేఖర్‌ మాట్లా డారు. పి.సునీత, మురళీ, వెంకట్రావు, పరమేశం, వెంకటకృష్ణ పాల్గొన్నారు.

➡️