పథకాలు రద్దు చేసి మోసం

ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మిక సంఘం
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
తమకు గతంలో మాదిరి బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులు డిమాండ్‌ చేశారు. రూపాయి రూపాయి కూడగట్టి సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకుంటే ఆ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించడం సరికాదన్నారు. ఈ మేరకు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో నరసరావుపేటలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాదరావు అధ్యక్షత వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయవద్దని 1214 మెమో జారీ చేశారన్నారు. భవనిర్మాణ కార్మికులకు ఏదైనా ప్రమాదంలో లేదా వయోభారంతో చనిపోయిన బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు నుంచి రూ.2-5 లక్షల వరకు చెల్లించేవారని, ప్రసవించిన భవన నిర్మాణ కార్మికురాలికి కార్మికుని కుమార్తెకు రూ.20 వేలు బోర్డు ద్వారా చెల్లించేవారని, మహిళా కార్మికులు వివాహం చేసుకున్న కార్మికుని కుమార్తెకు వివాహం చేసినా రూ.20 వేలు కానుకగా వచ్చేవని వివరించారు. వైసిపి పాలనలో ఇవేమీ రావడం లేదన్నారు. సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులను రాష్ట్ర బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు నిధులేనని, ఈ నిధులను భవన నిర్మాణదారులు సివిల్‌ వర్క్‌ చేసే కాంట్రాక్టర్లు చెల్లించిన కార్మిక సంక్షేమ నిధికి జమ చేసిన డబ్బులని తెలిపారు. కార్మికుల సొమ్మును భవన నిర్మాణ బోర్డుకు జమ చేసి సంక్షేమానికి ఖర్చు పెట్టాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఇస్తున్నారని, అయితే కుటుంబ పెద్దకే వర్తిస్తోందని, భవనిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకుంటే వారి కుటుంబ పెద్ద అయినా కాకపోయినా కుటుంబ సభ్యుడైన సంక్షేమ నిధి ద్వారా రూ.5 లక్షలు అందించే వారని తెలిపారు. సహజ మరణం పాలైన కార్మికులకు రూ.2 లక్షలు, రూ.20 వేలు మట్టి ఖర్చులు గతంలో వచ్చేవని చెప్పారు. నవరత్నాలలో భాగంగా పెళ్లి కానుకకు అర్హత సాధించాలంటే పెళ్లి కుమార్తె 10 తరగతి పాసై ఉండాలని బిల్డింగ్‌ వర్క్‌ వెల్ఫేర్‌ ద్వారా ఇచ్చిన పెళ్లి కానుకకు చదువు కొలమానం లేదని 18 ఏళ్లు నిండితే ఇచ్చేవారని తెలిపారు. వీటన్నింటినీ రద్దు చేయడం ద్వారా కార్మికులను సిఎం మోసం చేశారని మండిపడ్డారు. ఆ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశౄరు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎ.ఆంజనేయులు, బి.కొండలు, కె.సురేష్‌, సాయి, పి.శ్రీను, శివ, సాయి పాల్గొన్నారు.

➡️