పడిపోతున్న భూగర్భ జలాలు

      అనంతపురం ప్రతినిధి : భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. 2023 ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలో -1.87 మీటర్లు పడిపోగా సత్యసాయి జిల్లాలో 2.9 మీటర్లు అధికంగా పడిపోయాయి. వచ్చే నెలకు ఇవి మరింత పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో దాహార్తి నెలకొంటోంది సత్యసాయి జిల్లాలో ఓడీసీ తదితర మండలాల్లో ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బోరు బావుల్లోనూ నీరు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.

వర్షపాతం తక్కువే..! 

           అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం 456 మిల్లీమీటర్లు అయితే 340.41 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. సాధారణం కంటే 23 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. సత్యసాయి జిల్లాలో సాధారణ వర్షపాతం 525.71 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 401 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యింది. వర్షాభావం కారణంగా ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించారు. రబీలోనూ కరువు పరిస్థితులే నెలకొన్నాయి. ఈ ప్రభావం వేసవి మొదలు కావడంతో మరింత తీవ్రమైంది. భూగర్బ జలాలు వడివడిగా పడిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి భూగర్బ జలాలు తగ్గిపోతున్నాయి. సీజన్‌ ప్రారంభంలో 7.39 మీటర్లు వరకు నీళ్లు ఉండేవి. ఫిబ్రవరి మాసంకు 11.91 మీటర్లకు పడిపోయాయి. -1.87 మీటర్లు తగ్గిపోయాయి. సత్యసాయి జిల్లా 7.91 మీటర్ల నుంచి 13.57 మీటర్లు పడిపోయాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలకు 2.9 మీటర్ల లోతుకుపోయాయి. మండలాల వారీగా ఎక్స్‌ప్లాయిటెడ్‌ గ్రామాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆరు గ్రామాలుంటే, సత్యసాయి జిల్లాలో 42 గ్రామాల్లో ఎక్స్‌ప్లాయిటెడ్‌ ఉన్నాయి.

ఎండుతున్న పంటలు… మొదలైన దాహార్తి..

        వర్షాభావంతో బోరుబావుల్లోనూ నీటి మట్టం పడిపోతోంది. దీంతో బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో అత్యధికంగా బత్తాయి పంట సాగవుతుంది. అన్ని పంటలు బోరుబావులపైనే ఆధారపడి సాగవుతున్నాయి. బోరుబావుల్లో నీరు ఇంకిపోవడంతో ట్యాంకర్ల ద్వారా పంటలను కాపాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి అనేక చోట్ల మొదలైంది. సత్యసాయి జిల్లాలో 40కిపైగా గ్రామాల్లో నీటి సమస్య ఉంది. అనంతపురం జిల్లాలోనూ మొదలైంది. నీటి సమస్యను అధిగమించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేసామని అధికారులు చెబుతున్నారు.

➡️