పంటలు కాపాడేందుకు ప్రాధాన్యత

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌

ప్రజాశక్తి-విజయనగరం : వర్షం తగ్గిన వెంటనే వరి పంటను కాపాడేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగుచేస్తున్న పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 1500 ఎకరాల్లో పంట కోతలు కోసి ఆయా పొలాల్లోనే వదిలిపెట్టారని తెలిపారు. పొలాల్లో ఉన్న వరి పంటను కాపాడేందుకు వీలుగా నిల్వ ఉన్న వర్షపు నీటిని తోడేందుకు వీలుగా సాయాన్ని అందిస్తామని తెలిపారు. దీంతోపాటు మరో 400 ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉందని, దీనిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పారు. పంటపొలాల్లో వర్షపు నీరు తగ్గిన తర్వాత ఈ నెల 9 నుంచి పంటనష్టాలపై అంచనా వేసే కార్యక్రమం చేపడతామన్నారు.జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైనట్టు కలెక్టర్‌ వెల్లడించారు. సగటున అన్ని మండలాల్లో 9 మి.మీ.ల వర్షపాతం కురిసిందన్నారు. నెల్లిమర్ల, భోగాపురం, శృంగవరపుకోట మండలాల్లో సెంటీమీటరుపైనే వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. జిల్లాలో రోడ్లు, విద్యుత్తు సరఫరాకు పెద్దగా అంతరాయమేమీ కలగలేదన్నారు. తుపాను కారణంగా ప్రాణనష్టం కాని, ఇళ్లు దెబ్బతినడం వంటి ఘటనలు గానీ నమోదు కాలేదన్నారు.వీడియో కాన్ఫరెన్సులో ఎస్‌పి దీపిక పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత, ప్రకతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ డిపిఎం ఎం.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

➡️