పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల ఆందోళన

రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా

ఆందోళన చేస్తున్న పిఆర్‌ ఇంజినీర్లు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు దశల వారీ ఉద్యమం ఐదో రోజుకు చేరింది. అందులో భాగంగా నగరంలోని జెడ్‌పి ప్రాంగణంలో ఉన్న సర్కిల్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన చేపట్టారు. పిఆర్‌ జెఎసి సెక్రటరీ జనరల్‌ కె.సిహెచ్‌.మహంతి మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఐదేళ్ల క్రితం చేపట్టిన ఎన్‌ఆర్‌జిఎస్‌, ఎస్‌డిఎప్‌ పనుల్లో నాణ్యతపై ఇప్పుడు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని అన్నారు. పంచాయతీరాజ్‌ ఇంజినీర్లపై ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి వల్ల ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందన్నారు. గతంలో ప్రభుత్వం చేపట్టిన విచారణ అనంతరం ఇంజినీర్లపై చర్యలకు ఉపక్రమించారని అన్నారు. ఆ సమయంలో చేపట్టిన ఆందోళన వల్ల స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 27న ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో భాగంగా మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు ఎస్‌.వి.ఎ.పోలినాయుడు, బి.కృష్ణారావు, ఎస్‌.కోదండరావు, నగేష్‌పట్నాయక్‌, టి.వి.ఎం.రాజు, కన్యాకుమారి, కె.హేమలత, పిఆర్‌ ఎస్‌ఇ వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఇఇ గిరిధర్‌ పాల్గొన్నారు.

➡️