నోటీసులు ఉపసంహరించుకోవాలి

సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న

కొత్తూరు : గంగిరెద్దుకు వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీలు

  • అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
  • 31వ రోజుకు అంగన్వాడీల సమ్మె

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వ బెదిరింపుల్లో భాగంగా ఇస్తున్న నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, ఉపాధ్యక్షులు పి.లతాదేవి డిమాండ్‌ చేశారు. లేకుంటే నిరవధిక నిరాహార దీక్షతో పాటు చలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. నగరంలోని జ్యోతిరావు పూలే పార్కు వద్ద 24 గంటల నిరాహార దీక్షను కొనసాగించారు. శిబిరం వద్ద వారు మాట్లాడుతూ అంగన్వాడీలు 31 రోజులుగా అంకుఠిత దీక్షతో పోరాడుతున్నారని తెలిపారు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని తెలిపారు. అంగన్వాడీలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి సంఘీభావం తెలిపి రూ.ఐదు వేల విరాళం అందజేశారు. దీక్షలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి ఎన్‌.హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో ఐసిడిఎస్‌ కార్యాలయం సమ్మె శిబిరాన్ని సందర్శించి జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి జనార్థనరావు సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక మెట్టు దిగి అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పి.భూలక్ష్మి, మొదలవలస లత, మాధవి, పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రణస్థలం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.సుజాత తదితరులు పాల్గొన్నారు. పొందూరులో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జ్యోతిలక్ష్మి, నాగరత్నం, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం పట్టణంలో బస్టాండ్‌ కూడలి వద్ద సమ్మె శిబిరం కొనసాగింది. శిబిరంలో అంగన్వాడీ కార్యకర్త ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెళియాపుట్టి మండలంలోని చాపరలో సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పట్టుదలతో పోరాడాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధ, నారాయణమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో సమ్మె శిబిరం వద్ద ఆటాపాటా నిర్వహించారు. యుటిఎఫ్‌ నాయకులు పాలవలస ధర్మారావు, తమ్మినేని వైకుంఠరావు, కె.దాలయ్య జానపద గీతాలతో ఆలపించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.రమణమ్మ, ఆదిలక్ష్మి, సిహెచ్‌.ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరులో గంగిరెద్దుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిర్ల ప్రసాద్‌, నిమ్మక అప్పన్న, యూనియన్‌ నాయకులు కె.వి హేమలత, కె.లక్ష్మి, ధనలక్ష్మి, జలజాక్షి తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు హనుమంతు ఈశ్వరరావు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ తదితరులు పాల్గొన్నారు.

 

➡️