నెల్లూరులో పోలీసుల దాష్టీకం

Dec 31,2023 07:34 #Anganwadi strike
  • అంగన్‌వాడీల అడ్డగింత
  • పలువురికి గాయాలు
  • నాయకత్వాన్ని ఎంపిక చేసి అరెస్ట్‌లు-ఉద్రిక్తత
  • నిరసనగా ప్రదర్శనలు
  • రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడి

ప్రజాశక్తి- యంత్రాంగం : నెల్లూరులో అంగన్‌వాడీలపై పోలీసులు దాష్టికానికి దిగారు. మంత్రికి వినతిపత్రాన్ని ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. నాయకత్వాన్ని ఎంపిక చేసి అరెస్ట్‌ చేశారు. అడ్డుకున్న అంగన్‌వాడీలపై దుశ్శాసన పర్వానికి దిగారు. చీరలు గుంజుతూ, జుట్టు పట్టుకు లాగుతూ ఒకపక్కకు తోసివేశారు. ఈ తోపులాటలో పలువురు అంగన్‌వాడీలకు గాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్‌వాడీలపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లాలో కార్మికలోకం భగ్గుమంది. పలు చోట్ల నిరసన ప్రదర్శనల నిర్వహించారు.ఈ ప్రదర్శనల్లో మున్సిపల్‌ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఐద్వా, యువజన సంఘంతో పాటు పలువురు ఇతరులు పాల్గొన్నారు. యువజనసంఘం, ఐద్వా ఆధ్వర్యంలో కూడా ప్రదర్శనలు జరిగాయి. అంగన్‌వాడీ సంఘాల పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్లను ముట్టడించారు. వేలాదిమంది ఎక్కడికక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు ఆయన క్యాంపు కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్తున్న అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఎంపిక చేసిన నాయకత్వాన్ని బలవంతంగా అరెస్ట్‌ చేసి వ్యాన్‌లలో ఎక్కించారు. దీంతో వ్యాన్‌కు అడ్డంగా అంగన్‌వాడీలు బైఠాయించారు. ఈ సందర్భంగా మరోసారి పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు అంగన్‌వాడీలు గాయపడ్డారు.

వీరిని ప్రభుత్వాసత్రికి తరలించారు. పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన విషయంవిషయం తెలుసుకున్న మున్సిపల్‌ కార్మికులు, జనసేన పార్టీ నాయకులు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఈ అరెస్ట్‌లను సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ ఖండించారు.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా నిర్బంధాన్ని ఎదిరించి పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి మంత్రి ముందు బైఠాయించారు. అనంతపురం నుంచి వస్తున్న అంగన్‌వాడీల వాహనాలను కల్యాణదుర్గం రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వారు అక్కడే రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారిని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ పరామర్శించారు.

తొలగిస్తాం : డిప్యూటీ సిఎం బెదిరింపులు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. దీంతో, ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిపిఎం, సిఐటియు నేతలు రెచ్చగొట్టి నా ఇంటిపైకి మిమ్మల్ని పంపారు. సమ్మె విరమించి విధులకు హాజరుకండి. లేకపోతే మిమ్మల్ని తొలగించి కొత్తవారిని పెట్టుకుంటాం’ అంటూ బెదిరింపులకు దిగారు. . దీంతో, ఆయనపై అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీతాలు పెంచాలని 19 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. బెదిరింపు చర్యలు మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తమ డిమాండ్లు ఆమోదించే వరకూ విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. దీంతో, వీటిని సిఎం దృష్టికి తీసుకెళ్తానంటూ మంత్రి ఇంట్లోకి వెళ్లిపోయారు.

 

తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని, ప్రకాశం జిలా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. ఒంగోలులో మంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గుంటూరులో మంత్రి విడదల రజిని ఇంటిని ముట్టడించారు. దీంతో, ఆమె బయటకు వచ్చి వారి నుండి వినతిపత్రం స్వీకరించారు. సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.

తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. వారికి మద్దతుగా నిలిచిన సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అయినా, అంగన్‌వాడీలు భయపడకుండా ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన మంత్రి కారుమూరికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఎక్కడో ఉన్న నేను మీ కోసం వెంటనే ఇక్కడికి వచ్చానని, మీ సమస్యలు ముఖ్యమంత్రికి తెలియజేశానని అన్నారు.

అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్‌, రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కొవ్వూరులో మంత్రి తానేటి వనిత ఇళ్లను అంగన్‌వాడీలు ముట్టడించారు.

విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న అంగన్‌వాడీలను ఆయన ఇంటికి కొద్ది దూరంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అంగన్‌వాడీలు అక్కడే రహదారిపై బైటాయించారు. అనంతరం ఆయన ఇంట్లోకి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులతో జరిగిన తోపులాటలో చీపురుపల్లి మండలం కోనూరు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కమల సొమ్మసిల్లి పడిపోయారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు మానుకోవాలని డిప్యూటీ సిఎం రాజన్నదొరకు మక్కువలో అంగన్‌వాడీలు వినతిపత్రం ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని తోసుకుంటూ అంగన్‌వాడీలు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో, మంత్రి వచ్చి వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు.

విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీ సమ్మె శిబిరాన్ని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ (ఎఐటియుసి) ప్రారంభించి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటు సమ్మెను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పల్నాడు జిల్లా వినుకొండలో అంగన్‌వాడీ కేంద్రం తాళం పగుల గొడుతున్న సూపర్‌వైజర్‌ను సిఐటియు, ఎఐటియుసి నాయకులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పెడనలో మంత్రి జోగి రమేష్‌ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు.

➡️