నూజివీడు పట్టణ సిఐను సస్పెండ్‌ చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ఆశావర్కర్ల మహాధర్నా నేపథ్యంలో నూజివీడులో అరెస్టులు చేసి ఆశ వర్కర్లను, సిఐటియు నాయకులను అసభ్య పదజాలంతో దూషించి, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నర్సింహాపై దౌర్జన్యం చేసిన నూజివీడు పట్టణ సిఐపై విచారణ జరిపి సస్పెండ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా సమావేశం డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా సమావేశం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం హాలులో సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నర్సింహా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆశ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ మహాధర్నా సందర్భంగా ముందస్తు అరెస్టులు చేశారన్నారు. అరెస్ట్‌ చేసిన వారిని నూజివీడు సారధి ఇంజనీరింగ్‌ కాలేజీకి తరలించారని, భోజనాలు చేస్తున్న సందర్భంలో అరెస్ట్‌ అయిన వారి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారని చెప్పారు. భోజనాలు పూరైన తర్వాత అందరం చెబుతామని చెబుతుండగా నూజివీడు పట్టణ సిఐ మూర్తి భోజనాలు పెట్టకండి, ఆపేయ్యండని అసభ్య పదజాలంతో దూషించడం దారుణమని విమర్శించారు. మహిళల పట్ల ఆ రకంగా మాట్లాడడం సరికాదని చెప్తున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహాపై సిఐ దూసుకు వచ్చి గెంటుకుంటూ ఇష్టానుసారం మాట్లాడటమే కాకుండా, నీ సంగతి తేలుస్తానని దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నర్సింహాపై అక్రమంగా పోలీసు కేసు బనాయించడం తగదన్నారు. పోలీసు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి నూజివీడు టౌన్‌ సిఐపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఘంటా పాపారావు, సున్నా వెంకట్రావు పాల్గొన్నారు.

➡️