నీరులేక.. ఎండిన అరటితోట..!

నీరు లేక అరటి చెట్లను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు

        పుట్లూరు : గత సంవత్సరం నుంచి వర్షాలు లేకపోవడంతో బోరుబావుల్లో నీరు పాతాళానికి చేరింది. దీనికి తోడు హెచ్‌ఎల్‌సి నీటిని కూడా విడుదల చేయకపోవడంతో పండ్ల తోటల రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. బోరుబావుల్లో నీరు అడుగండడంతో పంటలను కాపాడుకోవడం అన్నదాతకు శక్తికి మించిన పనిగా మారింది. అప్పులు చేసి దాదాపు 1500 అడుగుల మేర బోర్లు వేయిస్తున్నా చుక్క నీరు బయటికి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చేసేది లేక రైతులు పండ్ల తోటలను తొలగించేస్తున్నారు. మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో గత నాలుగు నెలల క్రితం అరటి పంటను సాగు చేశాడు. చెట్లు పెరుగుతున్న క్రమంలో భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. బోర్లను నుంచి ఒక చుక్క కూడా నీరు రాకపోవడంతో చెట్లకు తడిలేక ఎండుదశకు చేరుకున్నాయి. నీటి వసతి లేనికారణంగా నాలుగు నెలల పాటు ఎంతో కష్టపడి పెంచిన అరటిమొక్కలను కాపాడుకోవడం కష్టం అని భావించి గురువారం నాడు ట్రాక్టర్‌ తొలగించేశాడు. దీంతో రైతుకు సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. పండ్ల తోటలు ఆదుకుంటాయని సాగు చేస్తే అవి కూడా నష్టాన్ని మిగిల్చాయంటూ రైతు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనకు పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

➡️