నిలిచిన పోలవరం గ్రామసభలు

గ్రామసభలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పోలవరం నిర్వాసితులు

ప్రజాశక్తి-చింతూరు

పోలవరం నిర్వాసిత ప్రజానీకానికి పరిహారం, పునరావాసం నిమిత్తం మూడు రోజులుగా జరుగుతున్న పోలవరం గ్రామసభలు శుక్రవారం నిర్వాసితుల అభ్యంతరం మేరకు అధికారులు నిలిపివేశారు. మండల కేంద్రంలో 1508 ఇళ్లు ఉండగా, కేవలం 650 ఇళ్లు మాత్రమే సర్వే చేసి గ్రామసభలు పెట్టటంపై బాధిత నిర్వాసితులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. అంతే కాకుండా రసీదు పత్రాలపైనా, భూమి అప్పగింత పత్రాలపైనా నిర్వాసితుల సంతకాలు తీసుకోవడం, హౌసింగ్‌, ఆర్‌ అండ్‌ బి అధికారుల సర్వేలు పూర్తికాకుండానే స్ట్రక్చర్‌ వ్యాల్యూ లెక్క కట్టకుండా ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించడంపై కొందరు నిర్వాసితులు పోలవరం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ ఆదిత్యకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ప్రవీణ్‌ ఆదిత్య సమగ్రంగా అన్ని నిర్వాసిత నివాసాలను, అన్ని శాఖల ద్వారా పూర్తిస్థాయిలో సర్వే చేసిన అనంతరమే గ్రామసభలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో మూడవరోజు పూర్తి కావాల్సిన గ్రామసభ కేవలం నిర్వాసితుల ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఇంటి పన్ను, వృత్తి పన్ను, కరెంటు బిల్లు, ఓటర్‌ ఐడి, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకొని నిలిపివేశారు. పూర్తిస్థాయిలో సర్వేల అనంతరం మళ్లీ గ్రామసభలు ఎప్పుడు నిర్వహించేది ముందుగా ప్రకటిస్తామని పోలవరం డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ తాసిల్దార్‌ తెలిపారు.తెలంగాణ ప్రాంతాల నుండి తరలివచ్చిన నిర్వాసితులు..గ్రామసభకు కచ్చితంగా హాజరుకావాలని తెలిజేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌, వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన నిర్వాసితులు అనేకమంది వారి వద్ద ఉన్న ఆధారిత పత్రాలు తీసుకొని హాజరయ్యారు. అయితే అధికారుల నిర్వాకం వల్ల అర్ధాంతరంగా గ్రామసభలు ఆగిపోవడంతో పలువురు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వందల మైళ్ళ నుండి చింతూరు చేరుకొని వ్యయ ప్రయాసలకు ఓర్చి, చలిలో ఇబ్బందులు పడుతూ వచ్చామని, తీరా వచ్చాక అసంబద్ధంగా నిర్వహిస్తున్న గ్రామసభ తమకు తీవ్ర నిరాశ మిగిల్చిందని వారు వాపోయారు. ఇకపై పూర్తిస్థాయి సర్వేలు చేసి నిర్థిష్టమైన లెక్కలతో గ్రామసభలు నిర్వహించాలని అధికారులను, ప్రభుత్వాన్ని నిర్వాసితులు కోరారు.

➡️