నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

Dec 18,2023 20:14

 ప్రజాశక్తి – కలెక్టరేట్‌ :  తోటపల్లి రిజర్వాయర్‌ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బంటు దాసు, నిర్వాసిత సంఘం నాయకులు కలిసి సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ గోవిందరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బంటు దాసు మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి నిర్వాసితుల సమస్యలకు సరైన పరిష్కారం లేక ఏళ్ల తరబడి నానా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే పిన్నింటి రామినాయుడువలస, బట్లభద్ర, బిత్తరపాడు, నిమ్మలపాడు, కల్లికోట, దుగ్గి గ్రామాల నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణానికి గానూ ఎటువంటి బిల్లులందక ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని, ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన ఇళ్లకు గానూ బిల్లులు అందక పోవడం వల్ల పనులు పూర్తికాకుండానే మధ్యలో నిలిచిపోగా, సుమారు రెండు వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకుండానే మిగిలిపోయాయని తెలిపారు. కనీసం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎంత మొత్తం ఆర్థికవ్యయం కేటాయించిందనే వివరాలు తెలియని పరిస్థితిలో అధికారులు ఉండడం బాధాకరమని అన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణానికి బిల్లులు సకాలంలో అందుతున్నా చాలా కాలం నాటి నిర్వాసితు గ్రామాల్లోని ఇళ్ల నిర్మాణానికి బిల్లులందకపోవడం విచారకరమని విమర్శించారు. అలాగే సుంకి, బాసంగి వంటి నిర్వాసిత గ్రామాల్లోని కనీస మౌలిక సదుపాయాల్లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కోటవానివలస నిర్వాసిత గ్రామానికి ప్రధాన రహదారి నుంచి రోడ్డు మార్గం కూడా లేదన్నారు. ఇదే విషయంపై నిర్వాసిత సంఘం నాయకులు ఇప్పటికే అనేకసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి నిర్వాసిత సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో నిర్వాసితులంతా ఏకమై ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తమ సమస్యల పరిష్కారానికై పోరాడాల్స ఉంటుందని హెచ్చరించారు. వినతిని అందజేసిన వారిలో నిర్వాసితుల సంఘం నాయకులు కె.రవీంద్ర, సదానందం, పిన్నింటి వెంకటరమణ పాల్గొన్నారు.

➡️