నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం : ఎపి జెఎసి

Feb 20,2024 21:02

అభివాదం చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఎపి జెఎసి నేతలు హెచ్చరించారు. 12 పిఆర్‌సి అమలు చేసే వరకూ 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, బకాయిలు విడుదల చేయాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని తదితర డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. తొలుత స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్‌ వరకూ భారీ ర్యాలీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వందల మంది పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట జెఎసి జిల్లా చైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ధర్నాకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ సంఘాలతో సానుకూల ధోరణితో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులు దాచుకున్న ఎపిజిఎల్‌ఐ, సరెండర్‌ లీవులు, జిపిఎఫ్‌ నిధులు ఇతర బకాయిలు అన్నీ కలిపి దాదాపు రూ.21500 కోట్లు ఉద్యోగులకు చెల్లించకుండా దారిమళ్లించి, ఉద్యోగులను రోడ్డుపైకి తీసుకొచ్చిందన్నారు. మూడేళ్ల నుండి సరెండర్‌ లీవులు పెండింగ్‌లో ఉన్నాయని, పిల్లల పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే 2022లో బిఆర్‌టిఎస్‌ రోడ్డును జరిగిన ఆందోళనను తలపించేలా ఈనెల 27న చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ఓటర్లు ఉద్యోగుల కుటుంబాల్లో ఉన్నారని, ప్రభుత్వాల గెలుపోటములు నిర్ణయిస్తారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ప్రజాస్వామ్య ధోరణి లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాలు, విద్యావేత్తలు, మేధావుల సలహాలు స్వీకరించే పరిస్థితి లేదన్నారు. కనీసం సమస్యలపై నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్‌ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎపిఎన్‌జిఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్‌.నాగూర్‌, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, ఎపిజెఎసి జిల్లా కన్వీనర్‌ ఎస్‌.సతీష్‌కుమార్‌, ఎపిటిఎఫ్‌ నాయకులు బసవలింగారావు, వేళాంగిణిరాజు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కె.నరసింహారెడ్డి, సేవా నాయక, రాధారాణి పాల్గొన్నారు.

➡️