నిరుపయోగంగా ఉన్న బస్‌ షెల్టర్‌ పాత బస్‌ షెల్టర్‌, రైతు బజార్‌

బస్‌ షెల్టర్‌ పాత బస్‌ షెల్టర్‌, రైతు బజార్‌

ప్రజాశక్తి-పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని పాత బస్టాండ్‌ సెంటర్లో బస్‌ షెల్టర్‌ శిథిలావస్థలో ఉండటంతో నిరుపయోగంగా ఉంది. అభివృద్ధికి నోచుకోక ఇక్కడ ఉన్న బస్సు షెల్టర్‌ ప్రాంగణ మంతా వ్యాపారస్తుల దుకాణాలతో నిండిపోయింది. దీంతో ప్రయాణికులకు అక్కరకు రాక బస్సు షెల్టర్‌ మరుగున పడిపోయింది. ఇదొక ప్రధాన కూడలి.. గతంలో ఇక్కడే ఆర్టీసీ బస్‌ డిపో మరియు కాంప్లెక్స్‌ నిర్వహించిన ప్రదేశమిది. ఈ పాత బస్టాండ్‌ చుట్టుపక్కల ఉన్న వీధులు, గ్రామాల ప్రజలు ఇక్కడే బస్సు ఎక్కుతుంటారు. వందలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడానికి రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖపట్నం, చోడవరం, అనకాపల్లి, రాజమండ్రి వంటి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడే బస్సు ఎక్కుతారు. కొయ్యూరు సీలేరు, జికే వీధి, చింతపల్లి, జిమాడుగుల, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా బస్సు ఎక్కడానికి ఇక్కడ నుంచే బయలుదేరుతారు. మూడు రోడ్ల కూడలి ఈ పాత బస్టాండ్‌ పాడేరులో ప్రయాణికులకు ముఖ్య కూడలి ప్రదేశంగా ఉంది. బసు షెల్టర్‌ ను ప్రయాణికుల సౌలభ్యం కోసం యూనియన్‌ బ్యాంకు వారు నిర్మించారు. ఎన్నో ఏళ్ళు ఈ బస్సు షెల్టర్‌ వినియోగంలో ఉండి ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కాలక్రమేణ ఈ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోక ఆక్రమణలకు గురై నిరుపయోగంగా మారింది. మైదాన ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలపడానికి బస్‌ షెల్టర్‌ ముందు అవసరమైన స్థలం ఉంది. ఈ పాత బస్టాండ్‌ ఆవరణలో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వందలాదిగా ప్రయాణికులు బస్సు ఎక్కి దిగుతుంటారు. వీరు కనీసం నిలుచోవడానికి కూడా స్థలం లేదు. వర్షం పడితే ఏ దుకాణంలోనూ దూరి తలదాచు కోవలసిన పరిస్థితి ఉంది.రైతు బజార్‌ దుస్థితి….. పాడేరు పట్టణం నడిబొడ్డున ఉన్న రైతు బజార్‌ కూడా నిరుపయోగంగా ఉంది. ఇందులో దుకాణ సముదాయం కూడా నిర్మించారు. వీటిని సరైన రీతిలో వ్యాపారులకు కేటాయించి అప్పగించక పోవడం దీన్ని నిర్వహణ పూర్తిగా వదిలేయడంతో రైతు బజార్‌ అద్వాన్నంగా మారింది. దీనికి తోడు అసాంఘిక కార్యకలాపాలకు వేదికయ్యింది. రైతులకు వ్యాపారులకు చెందకుండా లక్షలాది రూపాయలతో నిర్మించిన ఈ రైతు బజార్‌ పాత బస్టాండ్‌ ఆవరణలో ఒక శిధిల ప్రాంగణంగా మిగిలింది. జిల్లా కేంద్రమైన పాడేరులో ఈ రైతు బజార్‌ ప్రాంగణం ఎంతో విలువైన ప్రదేశం. ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి జరిగినా ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనిపై అధికారులు చొరవ తీసుకొని దృష్టి సారించాల్సి ఉంది. పాడేరు జిల్లా కేంద్రంగా అవతరించిన తర్వాత ఒకవైపు ట్రాఫిక్‌ సమస్య ఎంతో పెరిగింది. రోడ్లపైనే దుకాణాలు, ఆటోలు, వాహనాలు నిలుపుకునే తలాభావం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్పందించి పాత బస్టాండ్‌ ఆవరణ లోని బస్సు షెల్టర్‌ ను రైతు బజార్‌ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి అటు రైతులకు, వినియోగదారులకు వ్యాపారులకు ఇటు ప్రయాణికులకు సౌలభ్యం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

➡️