నిరాహార దీక్ష విరమణ

Jan 30,2024 20:15

ప్రజాశక్తి- బొబ్బిలి : గ్రంథాలయ భవనం మరమ్మత్తు పనులను బుధవారం నుంచి ప్రారంభించి వారం రోజుల్లో పూర్తి చేస్తామని మున్సిపల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ ఎఇ రవికుమార్‌ హామీ ఇవ్వడంతో జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి నిరాహారదీక్షను విరమించారు. నిరాహారదీక్ష శిబిరాన్ని బేబినాయన రెండోరోజు సందర్శించి మద్దతు ఇచ్చారు. బేబినాయన సమక్షంలో మున్సిపల్‌ అధికారులు హామీ ఇవ్వడంతో బాబు పాలూరికి బేబినాయన నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గ్రంథాలయ సమస్యపై పోరాటం చేసిన జనసేన నేతలను బేబినాయన అభినందిం చారు. జనసేన చేపట్టిన దీక్షకు మంగళవారం లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి, న్యాయవాది గంటి శర్మ, టిడిపి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు తదితరులు మద్దతు ప్రకటించారు.చౌకబారు రాజకీయాలు మానుకోవాలిగ్రంథాలయం భవనంపై జనసేన, టిడిపి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, జెసిఎస్‌ పట్టణ కన్వీనర్‌ రేజేటి విస్సు అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గ్రంథాలయ భవనం సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని, గత ఎన్నో ఏళ్ల నుంచి ఉందని గుర్తు చేశారు. గత పాలకులు ఎందుకు శాశ్వత భవనం నిర్మించలేదని ప్రశ్నించారు. నిరాహారదీక్ష చేసినంత మాత్రాన భయపడి పనులు చేయమని, ప్రజల అవసరాలను గుర్తించి సమస్యలు పరిష్కారానికి పని చేస్తామన్నారు. గ్రంథాల యానికి శాశ్వత భవనం లేకపోవడంతో పాఠశాల భవనాన్ని కేటాయించామన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.1.60 లక్షలు కేటాయించామని చెట్టు ఉండడం వల్ల తొలగించడం కష్టంగా ఉందని, నిధులు చాలవన్న భావంతో రూ.5లక్షలతో చైతన్య కనస్ట్రక్షన్‌కు టెండర్‌ వస్తే పనులు చేయలేమని చేతులెత్తేయడంతో మరల టెండర్‌ పిలవడంతో బొరే శేషుబాబుకు టెండర్‌ వచ్చిందని, త్వరలో పనులు ప్రారంభి స్తామని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. జెసిఎస్‌ పట్టణ కన్వీనర్‌ రేజేటి విస్సు మాట్లాడుతూ శాఖ గ్రంథాలయం కోసం గత 15ఏళ్లు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. గత పాలకుల హయాంలో అద్దె భవనంలో నడిస్తే వైసిపి హయాంలో మున్సిపల్‌ పాఠశాల భవనాన్ని కేటాయించా మన్నారు. సమావేశంలో పట్టణ అద్యక్షులు చోడిగంజి రమేష్‌ నాయుడు, చోడిగంజి రాజగోపాల్‌ ఉన్నారు.

➡️