నిరసన గళంపై ఉక్కుపాదమా..? : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రజాస్వామ్య దేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజలు తమకు రావాల్సిన హక్కులపై నిరసన గళాన్ని వినిపించటం సాధారణమని, కానీ ఎలాంటి సమావేశాలకు, సదస్సులకు, పోరాటాలకు కూడా అనుమతి ఇవ్వకుండా నిర్బంధం ప్రయోగించడం తగదని, వారిపై ఉక్కుపాదం మోపడం న్యాయం కాదని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.హరి ప్రసాద్‌ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమాలపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ భోగిమంటల్లో అప్రజాస్వామిక విధానాల పత్రాలను దహనం చేసిన నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా సంఘాలకు సంబంధించి ఏ చిన్న సదస్సు పెట్టుకోవాల్సి వచ్చినా, ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా నిరాకరించటం, యాక్ట్‌ 30 అమలులో ఉందని నిరాకరించే పని చేయటం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి రావాల్సిన సాధారణమైన హక్కులను అమలు చేసేదానిలో ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వ దష్టికి తీసుకువెళ్లడం కోసం, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగానే, నిరసన పోరాటాలకు పిలుపునిస్తారని చెప్పారు. తమ సొమ్ము తమకు ఇవ్వటానికి ఎందుకింత నిర్బంధమో ఈ ప్రభుత్వం చెప్పాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలకు, సంస్థలకు, ఉద్యోగ సంఘాలకు స్వేచ్ఛగా అనుమతిస్తున్న ప్రభుత్వం, ప్రత్యేకించి యుటిఎఫ్‌ పోరాటాలకు, సదస్సులకు అనుమతి ఇవ్వడం కోసం యాక్ట్‌ 30 సాకుగా చూపటం పట్ల తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ,ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని సష్టించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ చెంగల్‌ రాజు, జిల్లా కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు రమణయ్య, నాయకులు వినోద్‌ కుమార్‌, నరసింహారావు, పాపయ్య, వీరయ్య, రవి, ప్రతాప్‌, ప్రసాద్‌ రామక్రిష్ణ, చౌదరి, సి.వెంకట సుబ్బయ్య, శ్రీనివాస రాజు, మల్లికార్జున, యు.వెంకటసుబ్బయ్య లు పాల్గొన్నారు. పీలేరు : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించని ప్రభుత్వానికి నిరసనగా యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ ప్రతులను ఆదివారం పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) భోగి మంటలు వేసి దహనం చేశారు. ఉపాధ్యాయులకు రావలసిన రూ.18 వేల కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తాము ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం దాన్ని నిరంకుశంగా వ్యవహరిస్తూ అణచివేయడాన్ని వారు నిరసించారు. ఉపాధ్యాయులు పొదుపు చేసుకున్న డబ్బులకు కూడా దిక్కు లేకపోవడం దారుణం అన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ సదాశివ రెడ్డి, అన్నమయ్య జిల్లా కోశాధికారి బి. చంద్రశేఖర్‌, ఆడిట్‌ కమిటీ సభ్యులు విశ్వనాథ రెడ్డి, చిత్తూరు జిల్లా మాజీ గౌరవాధ్యక్షులు జి. రాధాకష్ణ ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకుడు మోడం చంగల్‌ రాయుడు, రేగంటి సుధాకర్‌, వెంకటరమణ, రమేష్‌ రెడ్డి, ఉదరు కిరణ్‌, దేవేందర్‌ రెడ్డి, సుబ్రమణ్యం, జయరాం పాల్గొన్నారు.

➡️