నిధుల కొరతతోనే పెన్షన్‌ ఆలస్యం

కడప అర్బన్‌ : వైసిపి ప్రభుత్వం నిధులు పక్కదారి పట్టించడం వల్ల పెన్షన్‌ ఆలస్యం అవుతూ ఉందని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్ది, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవి రెడ్ది ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని, ఎన్నికల కమిషన్‌, తెలుగుదేశం పార్టీ కాదని తెలిపారు. నిధులను సొంత కాంట్రాక్టర్లకు దోచి పెట్టి పెన్షన్‌ సొమ్ము ఖజానాలో లేకుండా ఖాళీ చేశారని పేర్కొన్నారు. పెన్షన్‌ల పంపిణీకి టిడిపి అడ్డుకుంటోందని వైసిపి నేతలు ప్రచారం చేయడం సిగ్గుచేటని తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని జగన్‌ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదన్నారు. ఖజానాలో నిధులు లేకనే కదా అని పేర్కొన్నారు. 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధప్రాతిపదికన ఫించన్లు ఇంటి వద్దే పంపిణీ చేయడం చేతకాక లబ్ధిదారులకు టిడిపి అడ్డుకుందని తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని తెలిపారు. జగన్‌రెడ్డి స్వార్ధ రాజకీయం వల్లే పింఛదారులు, వాలంటీర్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు రూ. 4వేలు పింఛన్‌ అందిస్తామని తెలిపారు. సకాలంలో ఇళ్ల వద్దనే పంపిణీ చేయకపోతే సిఎస్‌ జవహార్‌ రెడ్డి, సెర్ప్‌ సిఇఒ మురళీధర్‌ రెడ్డి, సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై ఎన్నికల కమిషన్‌ తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పెన్షన్‌ పంపిణీ చేయలేక తన దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి జగన్‌ ఎన్నికల కమిషన్‌, నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, టిడిపి పైన దుష్ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. వాలంటీర్లను ప్రజా సేవకులుగా కాక జగన్‌ తన పార్టీ కార్యకర్తల్లా దుర్వినియోగ పరిచినందునే ఎన్నికల కమిషన్‌ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టిందని పేర్కొన్నారు. వైసిపి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజాసేవ మాత్రమే చేసే వాలంటీర్లను రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ఫించన్ల పంపిణీ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే చేయాలని పేర్కొన్నారు.

➡️