నిఘాపై 3న ప్రత్యేక సమీక్ష-సిఇఒ ముఖేష్‌కుమార్‌మీనా

Mar 22,2024 22:40 #mukesh kumar meena, #press meet

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల నేపథ్యంలో పటిష్టంగా నిఘా వ్యవహరించడం, అక్రమ నగదు, సరుకు రవాణాను అడ్డుకోవడం, స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలపై ఏప్రిల్‌ 3వ తేదిన కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనా తెలిపారు. దీనికోసం రూపొందించిన ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ వినియోగాన్ని విస్తృతస్థాయిలో మెరుగుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిఘా పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను అప్రమత్తంచేయాలని, జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కనీసం ఒక కెమెరాతో స్టాటిక్‌ సర్వలెన్స్‌ టీమ్‌ను ఉంచాలని ముఖేష్‌కుమార్‌మీనా పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం 33 నిత్యావసర సేవల శాఖలకు ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ముఖ్యంగా పోలీస్‌, విద్యుత్తు, రవాణా, పోస్టల్‌ శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయపార్టీలు నిర్వహించే ఎటువంటి కార్యక్రమమైనా ముందుగా అనుమతి తప్పని సరిగా పొందాల్సి ఉందన్నారు. నేరుగా కానీ, ఎన్కోర్‌(పోర్టల్‌) ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలని, వాటిని వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి దుర్ఘటలనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చివరి నిమిషంలో హడావుడిగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టవద్దన్నారు. వ్యక్తిగతంగా దాఖలు చేసిన ఫారమ్‌-6లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే నూతన ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సిఇఓలు పి.కోటేశ్వరరావు, ఎమ్‌ఎన్‌ హరీంధర్‌ప్రసాద్‌, జాయింట్‌ సిఇఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఇఓలు కె.విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్‌ ఆఫీసరు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️