నాలుగు రెట్లు నష్టపరిహారమివ్వాలి

Feb 24,2024 21:05

మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌

నాలుగు రెట్లు నష్టపరిహారమివ్వాలి

– 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి

– సోలార్‌కు ప్రభుత్వమే భూసేకరణ చేపట్టాలి

– బాధిత రైతులను ఆదుకోవాలి

– ఎపి రైతు సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి – పాణ్యం

సోలార్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి, ప్రైవేటు మార్కెట్‌ రేటుపై అదనంగా నాలుగు రెట్లు కలిపి నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వమే భూ సేకరణ చేపట్టాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాణ్యం మండలం ఆలమూరు, కందికాయపల్లె, బేతంచెర్ల మండలంలో ముసలాయి చెరువు గ్రామాలలో ఏఎంగ్రీన్‌ ఎనర్జీ కంపెనీ సోలార్‌ ప్రాజెక్టుకు 2500 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు, అందులో 700 ఎకరాలు భూమి ఆలమూరు, కందికాయపల్లి గ్రామాలలో రైతుల భూములను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. బేతంచెర్ల మండలం ముసలాయి చెరువు గ్రామంలో మరికొంత భూమిని సోలార్‌ ప్రాజెక్ట్‌ వారు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇక్కడ ప్రైవేట్‌ కంపెనీ వారు రైతుల భూములను కొల్లగొడుతుంటే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వారి దోపిడీకి సహకరిస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని అమలు చేయకుండా ఎకరాకు పట్టా భూములకు రూ. 12 లక్షలు, డి పట్టా భూములకు రూ. 8 లక్షలు చొప్పున ధరలు వారే నిర్ణయించి రైతుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, గ్రామాల్లో ఎలాంటి గ్రామసభలు జరపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పట్టా భూములకు మాత్రమే చెక్కులు ఇవ్వడం, రైతులు ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే వారిని బెదిరించి ఈ డబ్బు, చెక్కులు తీసుకోకుంటే వచ్చే అవి కూడా రాకుండా పోతాయని బెదిరిస్తున్నారని అన్నారు. పూర్వీకుల కాలం నుంచి అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములకు ఎలాంటి నష్టపరిహారం ప్రకటించకుండానే భూమి స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పారు. బాధిత రైతులందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, పట్టా భూములతో పాటు అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములకు కూడా సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, పునరావసం కింద గ్రామ ప్రజలకు ఆర్థిక సాయం చేయాలని, గ్రామంలో ఉన్న 150 కుటుంబాలు భూమిలేని నిరుపేదలకు, చేతివృత్తుల వారికి చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకొని న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ప్రసాద్‌, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

➡️