నాయకులకు ధన్యవాదాలు

Mar 30,2024 22:07
ఫొటో : మాట్లాడుతున్న కావ్యక్రిష్ణారెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న కావ్యక్రిష్ణారెడ్డి
నాయకులకు ధన్యవాదాలు
ప్రజాశక్తి – కావలి : కావలి పట్టణంలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కావలి నియోజకవర్గ ప్రజలకు, టిడిపి – జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. శనివారం కావలి టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున విచ్చేసి టిడిపిపై విశేష అభిమానం చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించబోతుందన్నారు. నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూస్తుంటే టిడిపి విజయం కూడా ఖాయమని అర్థమైందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఎపి ప్రజలు చాలా కష్టాలు పడ్డారని, వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పును ఎపి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. యువత భవితకు కావాల్సిన నమ్మకం, భరోసా అని ఈ జగన్‌ రెడ్డి ఈ జన్మకు ఇవ్వలేడన్నారు. రాష్ట్రాన్ని జగన్‌ అప్పులు పాలు చేశాడని, ఒకటో తేదీ నాటికి ఎవరికీ జీతాలు అందడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయన్నారు. పింఛనుదారులకు ప్రతినెలా ఒకటో తారీఖు నాటికి పెన్షన్‌ అందుతుందన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు 9 సార్లు కరెంట్‌ ఛార్జీలు పెంచారని, కూటమి అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీల పెంపు ఉండదని హామీ ఇస్తున్నామన్నారు. పేద వాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లు అధికారంలోకి వచ్చిన తరువాత తెరుస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నాసిరకం మద్యాన్ని నిర్మూలిస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్‌ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టే బాధ్యతను తెలుగు దేశం పార్టీ తీసుకుంటుందన్నారు. ఎన్నో సాగు, తాగునీటి ప్రాజెక్టులను టిడిపి ప్రారంభించిందని, ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ, విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. 2014 – 19లో టిడిపి హయాంలో సాగునీటి రంగానికి రూ.68వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. నీటి లభ్యత ఉంటేనే ఏ ప్రాంతంలో అయిన పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందుతాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతినెలా రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మహిళలకు కలలకు రెక్కలు పథకం కింద వడ్డీలేని రుణాలు అందజేసి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలిచి వారికి న్యాయం చేస్తామన్నారు. వైసిపికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటంలో మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజాగళమని దానిని కావలి పట్టణంలో దిగ్విజయం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

➡️