నాగార్జున భవితవ్యమేమిటో?

Feb 24,2024 21:36

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : టిడిపి విజయనగరం పార్లమెంట్‌ స్థానం అధ్యక్షులు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున భవితవ్యంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢకొీట్టడం ద్వారా ఎన్నికల్లో ఆయన ప్రచార పర్వం ఇతర నియోజకవర్గాలపై పెద్దగా లేకుండా కట్టడిచేసేందుకు టిడిపి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్టే టిడిపి – జనసేన ఉమ్మడి తొలి జాబితాలో చీపురుపల్లి అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు ఇక్కడి నుంచి పోటీకి దింపుతారనుకుంటున్న గంటాకు కూడా మరెక్కడా సీటు కేటాయించ లేదు. దీంతో, గంటాకు చీపురుపల్లి సీటును ఖరారు చేయాలన్న పార్టీ ఆలోచన మరింత బలపడినట్టుగా తెలుస్తోంది. అయితే, నాగార్జునకు విజయనగరం పార్లమెంట్‌ స్థానం లేదా అందుకు తగ్గ హామీ ఇచ్చాక గంటా పేరును ఖరారు చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు నాగార్జునను ఒకింత విస్మయానికి గురిచేశాయి. దీంతో, రెండు మూడు రోజులుగా పార్టీ కేడర్‌కు అందుబాటులో లేరని, విజయవాడలో మకాంవేసి, చీపురుపల్లి అసెంబ్లీ సీటు కోసం పార్టీవద్ద తనవంతు వాదనను వినిపిస్తూ ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత నాగార్జున నియోజక వర్గాన్ని మరింతగా అంటిపెట్టుకుని ఉన్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే ఆర్‌ఇసిఎస్‌ ప్రైవేటీకరణ తదితర స్థానిక సమస్యలపైనా, రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందంజలోనే ఉన్నారు. దీంతో, సీటు కూడా తప్పక వస్తుందని ఆశగా ఎదురు చూశారు. కానీ, మంత్రి బొత్సను భయపెట్టేందుకు నాగార్జున సరిపోరనే ఆలోచనతో గంటా పేరును అనూహ్యంగా తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో గంటాకు ఉన్న బలమేమిటి? నాగార్జునకు లేని బల మేమిటి? అన్న కోణంలో జనం చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలోని నాగార్జున అభిమానులు, ముఖ్య అనుచరుల్లో గందరగోళం నెలకొంది. బొత్సను ఓడించడానికి ఎక్కడి నుంచో వలస నాయకులను తేవాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు. ఆర్థికంగా బలం ఉంటేనే గెలుస్తామను కోవడం అధిష్టానం తప్పుడు ఆలోచనేనని, దానికన్నా జనంతో మమేకమై పనిచేసిన వారినే ఓటర్లు విశ్వసిస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మంత్రి బొత్సపై గంటా శ్రీనివాసరావు పోటీకి తలపడక పోవచ్చని, అంతపెద్ద గెలుపు గుర్రంగా భావిస్తున్న అభ్యర్థిపై పోటీచేస్తే తాను మాత్రమే గెలుస్తానని ఎలా నమ్ముతారని అంటున్నారు. గంటా కూడా ఇందుకు తగ్గట్టే ప్రకటన చేశారు. తాను ఇంత వరకు పోటీచేసిన చోట రెండోసారి పోటీచేయక పోయినప్పటికీ, అది ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రమే జరిగిందని, అందుకే సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తున్నానని కూడా మెలిక పెట్టారు. గంటాకు టిడిపి అధిష్టానం మరో ప్రత్యామ్నాయం ఇవ్వకపోతే చీపురుపల్లిలో బొత్సపై పోటీచేయక తప్పదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గంటా ఎక్కడ కోరుకుంటే అక్కడే పార్టీ సీటు కేటాయించేదని, ప్రస్తుత పరిస్థితుల్లో కోరుకున్న స్థానాన్ని కేటాయించే పరిస్థితి ఆ పార్టీలో లేదనే వాదన కూడా వినిపిస్తోంది. అనివార్యంగా గంటా చీపురుపల్లి వస్తే నాగార్జునకు విజయనగరం పార్లమెంట్‌ స్థానం కట్టబెట్టవచ్చని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే నాగార్జునను ఎంపీగా పోటీచేయాలని పార్టీ కోరినట్టు, ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు కూడా చర్చనడుస్తోంది. భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.

➡️