నష్టపోయిన బోట్ల యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి : వి.శ్రీనివాసరావు

విశాఖ : గత మూడు రోజుల క్రితం ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కలాసీలకు, చిరువ్యాపారులకు భృతి చెల్లించాలని, ఫిషింగ్‌ హార్బర్‌లో భద్రతా చర్యలు, నిఘావ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో సిపిఐఎం విశాఖ, అనకాపల్లి జిల్లా కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జగదాంబ జోన్‌ కార్యదర్శి ఎం.సుబ్బారావు, జోన్‌ నాయకులు కె.వి.పి.చంద్రమౌళి, కె.నర్సింగరావు, ఈశ్వరరావులతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖపట్నం హార్బర్‌ లో ఇంత పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరగడంతో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించి బోటుకు 80 శాతం నష్టపరిహారం చెల్లిస్తామని మత్య్సశాఖ మంత్రితో ప్రకటించింది. ఈ నష్టానికి ఏ రకంగా విలువ కట్టారని ప్రశ్నించారు. బోటు కోల్పోయినవారికి బోటు ఇవ్వాలని, అందులో ఉండే డీజిల్‌, వల, వంటసామాగ్రి వంటి ఇతరత్రా వాటికి లెక్కగట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మత్స్యవేటతో సంబంధం ఉన్న నిఫుణులతో కమిటీ వేసి నష్టాన్ని అంచనా కట్టి ఆ నష్టాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వ చర్యలుండాలన్నారు. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థ చాలా లోపాభూయిష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మెరైన్‌ పోలీస్‌ వ్యవస్థ మరింత పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆకతాయిగాళ్లు, గంజాయి, మందు తాగేవాళ్లు బోటు యజమానులకు సంబంధం లేకుండా బోట్లలో ఉంటున్నట్లు అక్కడ మత్స్యకారులు తెలిపారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలైన నేరస్తుడిని వదిలి ఫిర్యాదుదారుడ్ని పట్టుకొని విచారించడం సరైంది కాదన్నారు. ఈ జెట్టీ విస్తరణకు ప్రభుత్వం 152 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లుగా ప్రకటనలకే పరిమితం కాకుండా పనులు ప్రారంభించాలన్నారు. మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీని పెంచాల్సింది పోయి 9 రూపాయల నుండి 7.50 రూపాయలకు తగ్గించేయడం దారుణమన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని, ఇప్పటివరకు బకాయి పడ్డ డీజిల్‌ సబ్సిడీ, వేసవికాలం వేట నిషేధ కాలానికి రావాల్సిన బకాయిలు కూడా తక్షణమే విడుదల చేయాలని వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

➡️