నగదు దోపిడీ డ్రామా బట్టబయలు

దోపిడీకి గురైన సొమ్మును చూపుతున్న ఎస్పీ అన్బురాజన్‌

       అనంతపురం క్రైం : అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం నాడు సంచలనం రేపిన బ్యాంకు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటలు గడవకనే నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.46.55 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అన్బురాజన్‌ బుధవారం నాడు స్థానిక పోలీసు కాన్ఫిరెన్స్‌ హాల్లో విలేకరులకు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని సిఎంఎస్‌ ఇన్ఫా సిస్టం లిమిటెడ్‌ కంపెనీలో కస్టోడియన్‌/ఏజెంట్‌గా పనిచేస్తున్న పోతులరాజును నిర్బంధించి కళ్లలో కారం కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి రూ.46,55,723 నగదును ఎత్తుకెళ్లారని కంపెనీ ప్రతినిధి శ్రీనివాసులు అనంతపురం వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు పోతురాజు పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం కలిగి ఆకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సాకే పోతులరాజు అనంతపురంలోని సిఎంఎస్‌ ఇన్ఫా సిస్టం లిమిటెడ్‌ కంపెనీలో మూడు సంవత్సరాల నుంచి కస్టోడియన్‌/ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ కాంట్రాక్ట్‌ ప్రకారం అనంతపురం నగరంలోని పలు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ కంపెనీల నుంచి వసూలు చేసిన నగదును వారి వద్ద నుంచి తీసుకుని సంబంధిత అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌లలో జమచేసి వారికి రిసిప్ట్‌ ఇస్తుంటారు. దీంతో పాటు కరూర్‌ వైశ్యా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌, ఐసిఐసిఐ, ఐడిబిఐ తదితర బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఆయా బ్యాంకుల ఎటిఎంల్లో క్యాష్‌ లోడింగ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో పోతులరాజు వద్ద పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు గుర్తించిన అతని స్నేహితులు అయ్యవారిపల్లి ఖలీల్‌బాషా, సయ్యద్‌ జబీఉల్లాలు డబ్బులు కాజేసే కుట్రకు పతకం రచించారు. ఇదే విషయాన్ని పోతులరాజుతో మాట్లాడారు. పెద్దమొత్తంలో నగదు తెస్తున్నపుడు తమకు సమాచారం ఇవ్వాలని, ఆ సమయంలో తామొచ్చి కళ్లలో కారంపొడి చల్లి, మూతికి ప్లాస్టర్‌ వేసి నగదు దొంగతనం చేసి వెళ్లినట్లు చిత్రీకరిస్తామని ప్లాన్‌ వేశారు. ఈ క్రమంలో పోతులరాజు కంపెనీ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం సుబాష్‌ రోడ్‌లో ఉన్న ఎల్‌ఐసి ఆఫీసు వద్దకు వెళ్లి రూ.46,55,723 నగదు తీసుకుని ఎల్‌ఐసి అకౌంట్‌లో జమచేయడానికి ఐడిబిఐ బ్యాంక్‌కు బయళ్దేరారు. ముందుకుగా వేసుకున్న పథకం మేరకు ఈ సమాచారాన్ని తన స్నేహితులైన ఖలీల్‌బాషా, సయ్యద్‌జబీఉల్లాలకు సమాచారం ఇచ్చాడు. ముందుగా మొత్తం నగదులో నుంచి రూ.23 లక్షలను బోయగేరికి వెళ్లి తన స్నేహితుడు బొల్లమ్‌ వెంకటరామారావుకు అప్పగించాడు. అందులో రూ.3లక్షలు ఫ్రీగా తీసుకుని తర్వాత తనకు రూ.20లక్షలు వెనక్కి ఇస్తేచాలని ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం పథకంలో భాగంగా ఖలీల్‌ బాషా, సయ్యద్‌ జబీఉల్లా ఇద్దరు ఐడిబిఐ బ్యాంక్‌ వద్దకు వెళ్లారు. బ్యాంకు మూడవ అంతస్తు నిర్మాణంలో ఉండటంతో పోతులరాజును అక్కడికి తీసికెళ్లి కళ్ళలో కారంపొడి చల్లారు. మూతికి ప్లాస్టర్‌ వేసి, చేతులు కట్టేసి అతని దగ్గర ఉన్న మిగతా రూ.23లక్షల నగదును తీసుకుని పరారయ్యారు. ఆ తర్వాత తనను బంధించి కళ్లలో కారం చల్లి, కాళ్లు చేతులు కట్టేసి ప్లాస్టర్‌ వేసి తను వద్దనున్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారని వీడియో కాల్‌ ద్వారా పోతులరాజు నాటకం ఆడాడు. వివరాలు సేకరించే నిమిత్తం పోలీసులు పోతులరాజును ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తానే నాటకం ఆడి నగదును ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నాడు. దీంతో మిగిలిని ఇద్దరున ఇందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఎత్తుకెళ్లిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే ఛేదించిన అనంతపురం అర్బన్‌ డీఎస్పీ జి.ప్రసాద రెడ్డి, ఒకటవ పోలీసు స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ వి.రెడ్డప్ప, సిసిఎస్‌ సిఐ జిటి.నాయుడు, ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

➡️