ధర్నా భగ్నానికి యత్నం

సమస్యల పరిష్కారం కోరుతూ కృషి విజ్ఞాన

కార్మికులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ వెంకటేష్‌

  • వ్యవసాయ కాంట్రాక్టు కార్మికులను అడ్డుకున్న పోలీసులు

*  రైల్వేస్టేషన్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌కి తరలింపు

  • నోటీసులు ఇచ్చి విడుదల

ప్రజాశక్తి – ఆమదాలవలస

సమస్యల పరిష్కారం కోరుతూ కృషి విజ్ఞాన కేంద్రం, ఎఆర్‌ఎస్‌, ఆర్‌ఎఆర్‌ఎస్‌ల్లో పనిచేస్తున్న వ్యవసాయ కాంట్రాక్టు కార్మికులు గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వద్ద ఈనెల 21న తలపెట్టిన ధర్నాను భగం చేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. ధర్నాలో పాల్గొనేందుకు ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరుతున్న 24 మంది కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాకు అనుమతుల్లేని కారణంగా వెళ్లడానికి వీల్లేదని ఎస్‌ఐ కె.వెంకటేష్‌ వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 149 కింద నోటీసులు అందజేసి, ధర్నాలో పాల్గొనబోమని సంతకాలు తీసుకుని వారిని విడిచిపెట్టారు. కెవికె కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.సీతామహాలక్ష్మి, పి.త్రివేణి మాట్లాడుతూ న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం తమపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు. రోజువారీ వేతనంతో జీవనం సాగిస్తున్న తమకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని చెప్పారు. కార్మికులందరినీ ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో అంబటి యుగంధర్‌, ఎ.గణపతి, బి.తేజేశ్వరరావు తదితరులున్నారు.

➡️