దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మికరాజ్యం స్థాపనే ప్రజలకు విముక్తి

Jan 22,2024 08:41 #IV Lenin, #sabha, #visaka
  • లెనిన్‌ శత వర్ధంతి సభలో వక్తలు

ప్రజాశక్తి-విశాఖ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎం.వి.ఎస్‌.శర్మ తెలిపారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ వద్ద గల నండూరి ప్రసాదరావు భవనం సిఐటియు ఆఫీస్‌లో లెనిన్‌ శత వర్ధంతి సభ పార్టీ సీనియర్‌ నాయకులు జి.ఎస్‌.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సభ ప్రారంభానికి ముందు లెనిన్‌ చిత్రపటానికి ఎం.వి.ఎస్‌.శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, సీనియర్‌ నాయకులు పెతకంశెట్టి వెంటకరెడ్డి, జి.యస్‌.రాజేశ్వరరావులు పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ మార్క్స్‌, ఏంగెల్స్‌ సిద్ధాంతాన్ని లెనిన్‌ ఆచరణలో పెట్టి రష్యాలో దోపిడీ వ్యవస్థను కూల్చి కార్మికవర్గరాజ్యాన్ని స్థాపించి నాయకత్వం వహించాడు లెనిన్‌. అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి విముక్తి కలిగించే విధంగా కృషి చేసిన వ్యక్తి. కార్మిక రాజ్యం స్థాపించడానికి ఒక్క కార్మికులతోనే సాధ్యం కాదని, దానికి కార్మిక, కర్షక మైత్రీ చాలా అవసరమని భావించి ఆచరణలో పెట్టారన్నారు. కేంద్రీకత ప్రజాస్వామ్యాన్ని అమలు జరిపి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన సాగించారన్నారు. 1917లో రష్యాలో విప్లవం సాధించి సుదీర్ఘకాలం ప్రజాపరిపాలనసాగించారన్నారు. రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం వచ్చాక భారతదేశంలో భారీ పరిశ్రమలు పెట్టేందుకు యంత్రాలను ఇచ్చి తోడ్పాటు అందించందన్నారు. అటువంటి మహానీయుడికి సిపిఎం పార్టీ నివాళర్పిస్తుందన్నారు. నేడు భారతదేశంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగాన్ని అమ్మేయడం, మూసివేసే పనిలో ఉంది. పెట్టుబడిదారులకు లాభాలకోసం పనిచేస్తున్న దోపిడీ ప్రభుత్వాలను కూల్చి కార్మిక రాజ్యం స్థాపనకోసం కషి చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ లెనిన్‌ సామ్రాజ్యవాద గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గొప్ప మహానీయుడన్నారు. భారతదేశానికి రష్యా చేసిన సహాయాన్ని గుర్తుచేసారు. నేడు భారతదేశంలో కార్మికులపైన, రైతులపైన పెద్దఎత్తున దాడి జరుగుతోందన్నారు. మతం పేరుతో ప్రజలను చీల్చి దోపిడీశక్తులకు తోడ్పడుతున్న ప్రభుత్వాలను కూలదోసి ప్రజాస్వామ్య హక్కులను, కార్మిక, కర్షకుల హక్కుల రక్షణకోసం కషి చేయాల్సిన అవసరం నేడు ఉందన్నారు. అందుకు ఈ ఏడాదిపొడుగునా లెనిన్‌ శత వర్ధంతి సభలు జరిపి పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిస్టు వ్యవస్థగల తేడాలను ప్రజలకు వివరించాలన్నారు.

➡️