దీక్షలు ముగిసినా ..సమ్మె కొనసాగింపు

Jan 11,2024 22:36
దీక్షలు ముగిసినా ..సమ్మె కొనసాగింపు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సమస్యలపై వీరోచితంగా పోరాడుతున్న అంగన్వాడీల నిరవధిక దీక్షలు గురువారం నాటికి ముగిశాయి. కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక దీక్షలు ముగిసినా ప్రాజెక్టుల స్థాయిలో నిర్వహిస్తున్న దీక్షలను కొనసాగిస్తామని అంగన్వాడీ యూనియన్స్‌ పిలుపు మేరకు ప్రాజెక్టు స్థాయిలో అంగన్వాడీలు దీక్షలను కనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు దీక్షలను కొనసాగిస్తామని అంగన్వాడీ యూనియన్‌ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ తీరులో మార్పు రాకుంటే తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి దీక్షా శిబారాల్లోనే జరుపుకుంటామని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లలిత, షకిల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొండిగా వ్యవహరించకుండా అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టు స్థాయిలో అంగన్వాడీలు రీలే దీక్షలను కొనసాగించారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 31 రోజుకు చేరింది. రిలే దీక్షలు 5 రోజులుగా జిల్లా కేంద్రంలో కొనసాగుతూ గురువారం కుప్పం, పలమనేర్‌ ప్రాజెక్టులు అంగన్వాడీలతో ముగించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 31 రోజులుగా మహిళలను రోడ్ల మీద పడేసిందన్నారు. జిల్లా అంగన్వాడీలు జిల్లా కేంద్రంకి వచ్చి రాత్రింబగళ్లు చలికి లెక్కచేయకుండా పోరాడుతున్న ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు కోసం ఇంత పోరాటం చేయాలా అని ప్రశ్నించారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ప్రారంభం నుంచి అనేక రకాల ఒత్తిడిలు తీసుకువచ్చిన అదరక, బెదరక అంగన్వాడీలు పోరాటానికి ముందుకు తీసుకెళుతున్నారు. చివరి అస్త్రంగా ప్రభుత్వం నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేయడం సరేంది కాదన్నారు. నోటీసులను తీసుకోకపోవడంతో ఇండ్లకు, సెంటర్ల వద్ద అతికించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ సంఘటనలకు పాల్పడుతున్నదో అర్థం కాని పరిస్థితి ఉందని అన్నారు. చిత్తూరు జిల్లాలో కుప్పం, నగరి, కార్వేటినగరం, చిత్తూరు, పలమనేరు, బైరెడ్డిపల్లి ప్రాజెక్టులలో కొంతమంది సిడిపివోలు, సూపర్వైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలకు చేస్తున్నారు. బైరెడ్డిపల్లి ప్రాజెక్టులో ఏకంగా శిబిరం దగ్గరకు వెళ్లి సూపర్వైజర్లు బెదిరిస్తున్నారంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో విధులు నిర్వహిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే చట్టవిరుద్ధంగా వాయిస్‌ మెసేజ్‌లు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతూ వ్యవహరిస్తున్న వారిపై జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మహిళలు రాత్రింబగళ్లు రిలేదీక్షలు కొనసాగించిన జిల్లాలోని అంగన్వాడీలందరికీ అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్థానికంగా ప్రాజెక్టుల వద్ద ఉన్న శిబిరాలు సమ్మె ముగించేంతవరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు లలిత సరళ, భారతి, పరిమళ సరస్వతిలతోపాటు కుప్పం పలమనేరు ప్రాజెక్టు నుంచి పాల్గొన్నారు. పలమనేరు: నియోజకవర్గం ఐసిడిఎస్‌ కార్యాలయం ఆవరణలో గురువారం 31వ రోజూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు గిరిధర్‌ గుప్తా, ఏఐటియుసి నాయకులు సుబ్రహ్మణ్యం, ఐఎఫ్‌టియు నాయకులు లక్ష్మీ, సమరశీల సరస్వతి మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా, ఎన్ని నోటీసులు ఇచ్చిన వెనకడుగు వేసేది లేదని, సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. బైరెడ్డిపల్లి: మండల ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు కలసి స్థానిక సచివాలయం వద్ద గురువారం 31వ రోజు సమ్మె కొనసాగించారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు శకుంతల, సరోజ, రజిని, నాగవేణి తెలిపారు. ఇదిలా ఉండగా అంగన్వాడీలు వెంటనే విధులకు హాజరు కావాలని సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ సెంటర్లకు నోటీసులు అందించారు. నోటీసులు ఇచ్చినా తాము సమ్మెను అపేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

➡️