దిగిరాకపోతే దేశవ్యాప్త ఉద్యమం – అంగన్‌వాడీల 24 గంటల దీక్ష ప్రారంభంలో ఎఆర్‌.సింధు

ఏలూరుఅర్బన్‌:అంగన్వాడీల సమస్యలు పరిష్కరించ కుంటే సమ్మెను దేశవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని ప్రధాని మోడీ, సిఎం జగన్‌ల భరతం పడతామని ఆలిండియా అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ ఫెడరేషన్‌ అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎఆర్‌.సింధు హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మె 26వ రోజు శనివారం జిల్లాకేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద 24 గంటల నిరాహార దీక్షను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటకలో నెలల తరబడి సమ్మెలు చేసి అక్కడ బిజెపి ప్రభుత్వ మెడలువంచి అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకున్నారని తెలిపారు. ఆ ఉద్యమాల స్ఫూర్తితో ఇక్కడ పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డబ్బులు లేవంటున్న జగన్‌ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఎందుకు పోరాడటం లేదని ఆమె ప్రశ్నించారు. పోరాడకుంటే బానిసత్వం తప్ప విముక్తి లేదన్నారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చి ఓట్లు వేయించుకుని ఎన్నికలయ్యాక మాట మార్చడం, మోసం చేయడం పరిపాటిగా మారిందని, దోపిడీ వర్గ పార్టీలన్నీ కార్మిక వర్గాన్ని మోసం చేస్తూనే ఉన్నాయని విమర్శించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని, అలాగే రిటైర్మెంట్‌ పెన్షన్‌ ఇస్తుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం అంగన్వాడీల బడ్జెట్‌లో కోత విధించి, పేద పిల్లల పొట్ట కొడుతుందని, పౌష్టికాహారానికి దూరంగా నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అంబానీ, ఆదానీ కార్పొరేట్ల ఆస్తులు ఆకాశానికి వెళుతున్నాయని, పేదల పరిస్థితి దినదినగండం నూరేళ్లు ఆయుష్షులా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.భారతి, ప్రాజెక్టు లీడర్లు స్వర్ణకుమారి, కె.సత్యవతి, త్రివేణి, నాగమణి, విమల మొత్తం 30 మంది 24 గంటల రిలే దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌, అంగన్వాడీల యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.విజయలక్ష్మి, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జె.గోపి పాల్గొన్నారు.

➡️