దాడులు, దౌర్జన్యాల తొడుగు

దాడులు, దౌర్జన్యాల తొడుగు నేటి రాజకీయాల్లో ఎత్తుగడలు నిరంతరం మారుతూనే ఉన్నాయి. అందులో ప్రజల ప్రయోజనాల కన్న.. రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా క

నేటి రాజకీయాల్లో ఎత్తుగడలు నిరంతరం మారుతూనే ఉన్నాయి. అందులో ప్రజల ప్రయోజనాల కన్న.. రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పొత్తుల చదరంగంలో జిల్లా కూడా ఒక పావుగా మారనుంది. ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకున్నా రాజకీయ మంటలు అలుముకున్నాయి. ప్రధానంగా ఎచ్చెర్ల నియోజకరవ్గంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యర్థులపై దాడులు కన్నా… స్వపక్షం నేతలపైనే దాడులు జరగడం ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. దాడులు, దౌజన్యాలతో జిల్లాలో దుర్మార్గమైన రాజకీయాలకు కొత్త అంకం మొదలైనట్లయింది. జరిగిన దాడి సామాజిక అంశం రూపంలో ముందకురావడం ప్రమాదకరమైన అంశం. ఆ నియోజకవర్గం ఓ స్థానిక ప్రజాప్రతినిధిపై దాడి చేయడంతో మరో రెండు సామాజిక తరగతుల ప్రమేయం ఉందన్న ప్రచారం ఉంది. ఆ ప్రచారానికి బలపరిచే విధంగా ఆ సామాజిక తరగతికి చెందిన వారు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఎస్‌పికి వినిపత్రం అందించడం, అందులో దాడికి పాల్పడిన వారి పేర్లను రాయడం చర్చనీయంశమైంది. అదే సమయంలో దాడికి గురైన వ్యక్తిని ఆస్పత్రిలో పరామర్శించడానికి మంత్రి వెళ్లడం సాధారణ విషయమైనా… సామాజిక అంశం తెరపైకి మరో రూపంలో వచ్చింది. ఆ నియోజకవర్గంలో కొద్దికాలం క్రితం ఓ విలేకరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందులో బాధ్యుల పేరు రాసి జేబులో ఉంచుకోవడం మరో చర్చనీయంశమైంది. ఆ కేసు పూర్వపరాలు వెలుగులోకి రాకుండా అధికార పార్టీ పక్కన పెట్టేలా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ ఇలాంటి శాంతిభద్రతల సమస్య ఎక్కువగా ఉంది. స్వపక్షంలోని గ్రూపులు బలంగా ఉన్నాయి. పర్యవసానంగా టిక్కెట్ల పంపిణీలో ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపను న్నాయని ప్రచారం ఉంది. ఇదే నియోజకవర్గంలో టిడిపిలోనూ అసమ్మతి రాగం ఉంది. ఎన్నికల సమయానికి అంతా సర్ధుకుంటుందని, తిరుగుబాటు ఉండదని కొందరు చెబుతున్నా… జిల్లాలోని టిడిపి గ్రూపు రాజకీయాలు ఫలితంగా అసమ్మతి రాగం ఎవరు తీయించారో ఆ నేతలే తిరుగుబాటు అభ్యర్థిని తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లదేన్న ప్రచారం ఉంది. ప్రధానమైన రెండు పార్టీలకు ఈ నియోజకవర్గంలో కుడి, ఎడమగా సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నది నిజం. పాతపట్నం నియోజకవర్గంలో గ్రూపుల గోల బలంగా ఉంది. వైసిపి అభ్యర్థిని మార్చకున్నా అసమ్మతి రాగం చివరి దశలో గళం విప్పి గాండ్రిస్తుందా! లేక మిన్నకుంటుందా! అన్నది చూడాల్సి ఉంది. టిడిపిలో మరో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇటీవల ఆ పార్టీ నేత లోకేష్‌ పర్యటన సమయంలో రెండు గ్రూపులు పోటీపడి జనసమీకరణకు సిద్ధమయ్యారు. ప్లెక్సీలు, బేనర్లు గ్రూపుల వారీ ప్రదర్శించారు. పరిస్థితి చూసి మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని లోకేష్‌ సముదాయించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ టిక్కెట్‌ ఆశిస్తున్న వారిలో ఒకరు తిరుగుబాటు చేయడానికైనా వెనుకాడరన్న ప్రచారం ఉంది. మరో పక్కన మద్దతును కూడగట్టేందుకు అధికార పక్షం చివరి క్షణంలో ప్రయత్నాలు చేయవచ్చునన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ నియోజకవర్గం రాజకీయం రసపట్టులా ఉందని తెలుస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో టిక్కెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్‌ పర్యటనలోనూ తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. తన పేరు ఐవిఆర్‌ సర్వేలో పొందుపర్చేస్థాయికి వెల్లగలిగారు. అయినప్పటికీ పార్టీ ఈ ఎన్నికలు ప్రతిష్టకు సంబంధించినది. కొత్త ప్రయోగాలతో ముందుకెళ్ల దన్న ప్రచారం ఆ పార్టీలోనే ఉంది. ఈ నియోజకవ ర్గంలో ఎన్నికల సమయంలో తిరుగుబాటు బెడద ఉండదని, అంతా సమసిపోతుందని నమ్మకాన్ని పలువురు వ్యక్తం చేయడం విశేషం. జిల్లాలో వైసిపి టిక్కెట్‌ ఆశించిన డాక్టర్‌ ధానేటి శ్రీధర్‌ ఆశలు వదులుకొని జనసేనలో చేరారు. ఆయనకు తప్పకుండా జిల్లాలో ఏదో ఒక నియోజకరవ్గంలో పొత్తులో భాగంగా టిక్కెట్‌ ఇస్తారని పవన్‌కళ్యాణ్‌ భరోసా ఇచ్చారన్న ప్రచారం బలంగా ఉంది. జనసేన జాబితాలో పలాస, శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో పొత్తుల్లో భాగంగా జనసేకు వచ్చే అవకాశం ఉందని కొందరు జనసేన నేతలు చెబుతున్నారు. అక్కడ మంత్రి అప్పలరాజును ఓడించడం తమ లక్ష్యమని, టిక్కెట్‌ మార్చకుంటే అదే జరుగుతుందని గతంలో ప్రకటన చేసిన అసమ్మతి బృందం ఉంది. జనసేనకు టిక్కెట్‌ ఇస్తే ఆ అసమ్మతి బృందం శ్రీధర్‌కు మద్దతు ఇస్తారా! లేదా అన్నది కాలం చెప్పాలి ఉంది. జిల్లా రాజకీయాల్లో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపితో టిడిపి పొత్తు ఖరారైన తరువాత రాజకీయ పొందికలో జిల్లాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కిషోర్‌చంద్రదేవ్‌ టిడిపికి రాజీనామా చేశారు. బిజెపితో పొత్తు జిల్లాలో ముఖ్య నాయకులకు ఇష్టం లేదని, కలిసి వెళ్తే నష్టపోతామన్న భయం వారిలో వెంటాడుతున్నట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకరవర్గాల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతుంది. మరోవైపు మిత్రుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టిడిపి నేత లోకేష్‌ నిర్వహించిన సభల్లో సుమారు 40 వేల మంది వరకు పాల్గొనట్లు ఇంటిలిజెన్స్‌ సమాచారం బట్టి తెలుస్తుంది. సభల్లో ఎంత మంది పాల్గొన్నా… టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టి కొత్త వాగ్ధానాలు చేయడం అలవాటైంది. జిల్లాలో ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో పూర్తిచేస్తామని లోకేష్‌ చెప్పడం విడ్డూరం. చంద్రబాబు పాలనలోనే ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. నిధుల కోసం, బిల్లుల చెల్లింపు కోసం ఆ పార్టీ అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్‌ శివాజీ గడ్డం పెంచుకోవడం, మౌనవ్రతం పాటించడం లాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా చంద్రబాబుకు పట్టలేదు. ఇది జనం మరవని చరిత్ర. టిడిపి, జనసేన పొత్తుల తరువాత జరిగిన సభలివి. వైసిపిలో సానుకూల ప్రచారం, టిడిపిలో ప్రతికూల అంశాలు ప్రచారంలో జిల్లా ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాల్సి ఉంది. – సత్తారు భాస్కరరావు

➡️