ఓటమి భయంతోనే మా కుటుంబంపై దాడులు

Mar 9,2024 20:55 #dastagiri, #press meet

– అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా

– నా తండ్రికి రక్షణ కల్పించాలి : దస్తగిరి

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/అమరావతి బ్యూరో:ఓటమి భయంతోనే తన తండ్రిపై ముఖ్యమంత్రి దాడి చేయించారని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు. తన జోలికొస్తే అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు. తన తండ్రికి రక్షణ కల్పించాలని కోరారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నీ కొడుకు జగన్‌పై పోటీ చేసే అంతటోడా, నిన్ను, నీ కొడుకును ఇద్దరిని చంపేస్తామని కత్తితో తన తండ్రి హజీవల్లిపై శుక్రవారం రాత్రి ముగ్గురు వైసిపి నాయకులు దాడి చేశారని’ తెలిపారు. సామాన్యుడికి పులివెందులలో పోటీ చేసే అర్హత లేదా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సిబిఐ వారికి తెలియజేసి కోర్టులో పిటిషన్‌ వేస్తానని తెలిపారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆయన బెయిల్‌ రద్దుకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానన్నారు. వివేకా హత్య కేసు విచారణ కూడా సజావుగా సాగడం లేదని చెప్పారు. తనను జైల్లో కొనాలని ప్రయత్నం చేశారని, దీనిపై కోర్టులో పోరాటం చేస్తానని తెలిపారు. దస్తగిరి తండ్రిపై దాడిదస్తగిరి తండ్రిపై శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద దాడి జరిగింది. శివరాత్రి జాగరణ కోసం వెళ్లిన షేక్‌ హాజీవల్లిపై వైసిపి నాయకులు దాడి చేశారని దస్తగిరి తెలిపారు. ప్రస్తుతం బాధితుడు పులివెందులలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పులివెందుల పోలీసులను వివరణ కోరగా, ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.

దస్తగిరి కుటుంబంపై దాడి దుర్మార్గం : అచ్చెన్నాయుడు

వివేకా హత్య కేసులో అప్రూవర్‌ షేక్‌ దస్తగిరి తండ్రి షేక్‌ హజీవలిపై వైసిపి దాడి దుర్మార్గమని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఒకవైపు చెల్లెల్లు, మరోవైపు వివేకా హత్యలో నిందితుడు దస్తగిరి వాస్తవాలు బహిర్గతం చేస్తారనే భయంతో సిఎం వైఎస్‌ జగన్‌ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పులివెందుల ప్రజలే తిరుగుబాటుకు సిద్ధమయ్యారని, అందుకే దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. హజీవలిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి, దస్తగిరి కుటుంబానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

➡️