దళిత కాలనీ దయనీయం

Feb 18,2024 20:47

ప్రజాశక్తి- రేగిడి: మండలంలోని చిన్నశిర్లాం దళిత కాలనీలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ కాలనీలో కనీసం సీసీ రోడ్డు లేదు, కాలువలు లేవు, తాగునీటి పైపులైన్‌ వద్ద కూడా మురుగు నీరు విలయతాండవం చేయడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా తమ సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని దళిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో 85 కుటుంబాలు జీవిస్తున్నాయి. టిడిపి హయామంలో నిర్మించిన ఒకటి, రెండు వీధులలో సిసి రోడ్లు తప్ప మిగతా వీధుల్లో సిసి రోడ్లు నిర్మాణాలకు నూతన పాలకవర్గం చర్యలు తీసుకోలేదు. నిర్మాణాలు చేపట్టిన సిసి రోడ్లకు డ్రైనేజ్‌ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టకపోవడం వాడుక నీరు రోడ్ల పైన నిల్వ ఉండి నాచుతేరి దోమలకు నిలయాలుగా మారాయి. రోడ్డుపై మురుగునీరు నిల్వలతోపాటు తాగునీటి కుళాయిల వద్ద మురుగునీరు నిల్వలు ఉండడంతో వ్యాధులు సంభవిస్తున్నాయని దళితవాసులు చెబుతున్నారు. పంచాయతీరాజ్‌ అధికారులు, పంచాయతీ పాలకవర్గం పట్టించుకునే దాఖలాలు కనిపించలేదు. దోమలు కారణంగా విష జ్వరాలు, డెంగీ, డయోరియా వంటి వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సంభవిస్తున్నాయని దళితు కుటుంబాలు చెబుతున్నాయి. తమ కాలనీపై పంచాయతీ పాలకవర్గం వివక్షత చూపుతోందని దళిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి ఈ దళిత కాలనీకి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందని చెబుతున్నారు. అసలు పంచాయతీ పాలకవర్గం గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దళిత కాలనీల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేసినప్పటికీ స్థానిక పాలకవర్గం అభివృద్ధిలో ఆమడ దూరంగా ఉందని దళిత కుటుంబాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా దళిత కాలనీ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

➡️