దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

        అనంతపురం కలెక్టరేట్‌ : ఓటర్ల దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.గౌతమి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలియజేశారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర చీఫ్‌ ఎలక్టరోల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌ వీసీ హాల్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫామ్‌- 6,7,8 దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఫామ్‌- 6, 8 క్లెయిమ్స్‌ కి సంబంధించి నిర్ణీత గడువులో ఉన్నాయని, గడవు దాటిన తర్వాత వాటిని పరిష్కరిస్తామన్నారు. ఫామ్‌- 7 దరఖాస్తుల పరిష్కారానికి అనుమతి కోసం సీఈవోకు పంపామన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్‌ స్టేషన్లలో అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో వి.శ్రీనివాసులు రెడ్డి, ఈఆర్‌ఒ శిరీషా, డిప్యూటీ కలెక్టర్‌ విశ్వనాథ్‌, సిపిఒ అశోక్‌ కుమార్‌ రెడ్డి, డిఐఒ రవిశంకర్‌, కలెక్టరేట్‌ కోఆర్డినేషన్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఎలక్షన్‌ సెల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్యాముల్‌, తహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️