తొలి వన్డేలో ఆసీస్‌ గెలుపు- వెస్టిండీస్‌తో సిరీస్‌

Feb 2,2024 22:30 #Sports

మెల్‌బోర్న్‌: రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు షాకిచ్చి అనూహ్య విజయం సాధించిన వెస్టిండీస్‌.. వన్డే సిరీస్‌లో ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయలేకపోయింది. మెల్‌బోర్న్‌ వేదికగా శుక్రవారం ముగిసిన తొలి వన్డేలో ఆసీస్‌.. 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌.. 38.3 ఓవర్లలోనే ఛేదించింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ (65; 43 బంతుల్లో 10ఫోర్లు, సిక్సర్‌)తో రాణించాడు. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ విండీస్‌ను బ్యాటింగ్‌ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. నాలుగో ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్లు అలిక్‌ అథనాజ్‌ (5), జస్టిన్‌ గ్రీవ్స్‌ (1)లు పెవిలియన్‌ చేరారు. కెప్టెన్‌ షై హోప్‌(12)తో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ కవెమ్‌ హాడ్జ్‌ (11) సైతం విఫలమయ్యారు. కానీ వన్‌ డౌన్‌ బ్యాటర్‌ కీసీ కార్టీ (88; 108బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), రోస్టన్‌ ఛేజ్‌(59)లు రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో జేవియర్‌ బార్లెట్‌ నాలుగు వికెట్ల (4/17)తో చెలరేగాడు. సీన్‌ అబాడ్‌, కామెరూన్‌ గ్రీన్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఆసీస్‌.. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(4) వికెట్‌ను కోల్పోయింది. కానీ జోష్‌ ఇంగ్లిస్‌.. గ్రీన్‌ (77నాటౌట్‌, 104బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు)లు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. ఇంగ్లిస్‌ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ (79; 79బంతుల్లో 8ఫోర్లు)తో కలిసి గ్రీన్‌ మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించాడు. మూడో వికెట్‌కు వీరు అజేయంగా 149 పరుగులు జోడించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బార్లేట్‌కు లభించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యతలో ఉండగా.. రెండో వన్డే సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది.

➡️