తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక ఎన్‌టిఆర్‌

ప్రజాశక్తి-ఒంగోలు తెలుగుజాతి ఆత్మగౌరవ పతాక ఎన్‌టిఆర్‌ అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌ రావు తెలిపారు. స్థానిక సివిఎన్‌ రీడింగ్‌ రూం ఆవరణలో ఒంగోలు ఎన్‌టిఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఎన్‌టిఆర్‌ వర్ధంతి సభ నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన నాటకోత్సవ వేడుకల్లో దామచర్ల జనార్ధన్‌రావు, నల్లూరి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్ధన్‌ మాట్లాడుతూ తెలుగు జాతికి ఘన కీర్తిని తెచ్చిన మహనీయుడు, తెలుగు భాషా ప్రేమికుడు, కారణజన్ముడు ఎన్‌టిఆర్‌ అని తెలిపారు. ఆయన సేవలు మరువలేనివని స్మరించుకున్నారు. నరసం గౌరవాధ్యక్షురాలు తేళ్ళ అరుణ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నటుడు, ప్రజానాయకుడని కొనియాడారు. ఎన్‌టిఆర్‌ ఏరూపానికైనా అతికినట్లుగా సరిపోయే నిండైన విగ్రహం అని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ పేదల పక్షాన నిలిచిన మహోన్నతవ్యక్తి, మహానటుడు అని తెలిపారు. అందరికీ సంక్షేమ పథకాలను అందించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సంస్థ అధ్యక్షుడు సూదనగుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ పేరుతో నాటకోత్సవాలను నిర్వహించడం చాలా గర్వంగా ఉందన్నారు. అనంతరం పిడిసిసి బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌, కళామిత్రమండలి అధ్యక్షుడు డాక్టర్‌ నూనె అంకమ్మరావు, ఆర్ల వెంకటరత్నం, కామరాజుగడ్డ కుసుమ కుమారి, రావుల పద్మజ, పసుపులేటి సునీత, ఎం.ప్రశాంతి, మారెళ్ళ సత్యనారాయణ, సూదనగుంట శేషయ్య , సిహెచ్‌.మల్లేశ్వరరావు, తేలపల్లి వెంకటేశ్వర్లు, సూదనగుంట సుబ్బారావు, సిహెచ్‌. శ్రీనివాసరావు తదితరులు నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ ప్రసంగించారు. అనంతరం ప్రదర్శించిన నాటికలు నేటి యువతరానికి కనువిప్పు కలిగేలా ఆకట్టుకున్నాయి. తొలుత చందూ డ్యాన్స్‌ అకాడమీ చిన్నారులు కె.బాలకోటయ్య నిర్వహణలో ప్రదర్శించిన నత్యాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

➡️