తెనాలి నియోజకవర్గంలో రసవత్తర పోటీ

Mar 18,2024 00:09

ఎన్నికల శంఖారావం పూరించిన శివకుమార్‌
ప్రజాశక్తి-తెనాలి :
సార్వత్రిక ఎన్నికలంటే తెనాలికి ప్రత్యేక స్థానం, ఇక్కడి ఫలితంపైనే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. ప్రతిసారి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఎంపికలో కూడా చివరి వరకూ ఉత్కంఠత కొనసాగేది. అయితే ఈ దఫా అందుకు భిన్నంగా ఎన్నికల కోడ్‌ కంటే ముందే అభ్యర్థులను కూడా ప్రధాన పార్టీలు ఖరారు చేశాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ వైసిపి నుంచి తిరిగి సీటు దక్కించుకోగా, టిడిపి, జనసేన, బిజెపి కూటమి నుంచి జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌ సీటు దక్కించుకున్నారు. అంతే కాకుండా ఇదే కూటమి నుంచి గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ కూడా ఇదే నియోజకవర్గం వారే. మే 13న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ ముఖచిత్రం, పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల వివరాలు..తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో తెనాలి, కొల్లిపర రెండు మండలాలున్నాయి. కొల్లిపర మండలంలో 20 గ్రామాలుండగా, తెనాలి మండలంలో 18 గ్రామాలున్నాయి. తాజాగా ఓటర్ల జాబితా సవరణ అనంతరం అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 2,64,894 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,27,603 మంది, స్త్రీలు 1,36,795 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐలు 170 మంది, త్రివిధ దళాల్లో పనిచేస్తున్న 288 మంది, ట్రాన్స్‌ జెండర్స్‌ 44 మంది ఓటర్లుగా ఉన్నారు. తెనాలి పట్టణం, రూరల్‌, కొల్లిపర మండలం విడివిడిగా ఓటర్లను పరిశీలిస్తే తెనాలి పట్టణంలో 1,55,063 మంది ఓటర్లుండగా వీరిలో 74,584 మంది పురుషులు, 80,446 మహిళలు ఉన్నారు. తెనాలి రూరల్‌ మండలంలో పురుషులు 64,666 ఓటర్లుండగా వారిలో పురుషులు 31,301, మహిళలు 33,361 మంది, కొల్లిపర మండలంలో 44.707 మంది ఓటర్లుండగా వారిలో మహిళలు 22,988, పురుషులు 21,718 ఉన్నారు.

వైసిపి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పోటీలో ఉన్నారు. ఆయన వైసిపి నుంచి పోటీ చేయటం ఇది మూడోసారి. 2014లో ఓడిపోయారు. తిరిగి 2019లో గెలిచి, ఇపుడు తాజాగా మరలా పోటీ చేస్తున్నారు. గతనెల 26న ఎన్నికల శంఖారావం పూరించారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి పోటీ చేయటం ఇది ఐదోసారి. గతంలో 2004, 2009 నుంచి కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ వంటి పదవులను అలంకరించారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో అదే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడియారు. తదుపరి జనసేర పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి, మరలా ఓటమి పాలయ్యారు. తాజాగా ఐదోసారి జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పొత్తులకు ముందే తెనాలి సీటును మనోహర్‌కు ప్రకటించినా, పొత్తుల తరువాత టిక్కెట్‌ మాజీ మంత్రి ఆలపాటికి దక్కుతుందా? నాదెండ్ల మనోహర్‌కు దక్కుతుందా? అనే సందేహాలకు తెరదించుతూ ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్‌ను ఆ పార్టీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో తొలుత ఆలపాటి కొంత నిరాశకు గురైనా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా మాట్లాడటంతో సర్ధుకుని మనోహర్‌కు మద్దతు తెలిపారు. దీనికితోడు గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ కూడా నియోజకవర్గంలోని బుర్రిపాలెం గ్రామానికి చెందిన వారు కావటం ప్రత్యేకతను సంతరించుకుంది. మనోహర్‌, రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌ కలిసి ఉమ్మడి ప్రచారానికి తెరతీశారు.

అన్నాబత్తుని శివకుమార్‌, నాదెండ్ల మనోహర్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇక్కడ పోటీలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన డాక్టర్‌ చందు సాంబశివుడు ఇదే స్థానం నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల నియోజకవర్గంలోని కొలకలూరు పర్యటనను కూడా ఆయన విజయవంతం చేశారు. షర్మిల పర్యటనలో కాంగ్రెస్‌ కురువృద్ధులు పాల్గొనడం, ప్రత్యేక హోదా నినాదం, ‘ఇండియా’ కూటమి తదితరాల నేపథ్యంలో ఆ పార్టీ ప్రభావమూ ఎన్నికల్లో ఉంటుందనే భావన నెలకొంది. ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థుల వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.

➡️