తుళ్లూరు శిబిరంలో మాట్లాడుతున్న జెడి శీలం

Mar 5,2024 00:12

న్యాయసాధన సభలో అమరావతి గళం వినిపించండి
ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై 7న గుంటూరులో జరిగే న్యాయ సాధన సభలో రాజధాని రైతులు భాగస్వాములు కావాలని, సభలో అమరావతి గళం వినిపించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్స్‌ పార్టీ నాయకులు జేడీ శీలం కోరారు. కాంగ్రెస్‌ నాయకులు సుంకర పద్మశ్రీ, రాజధాని ప్రాంత కాంగ్రెస్స్‌ నాయకులతో కలిసి తుళ్లూరు రైతు దీక్షా శిబిరాన్ని జెసి శీలం సోమవారం సందర్శించి రైతు జెఎసి నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని అమరావతేనని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి, విభజన హామీల అమలుకు నిధులు ఎందుకు ఇవ్వలేదో న్యాయ సాధన సభలో నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. అమరావతిలో రాహుల్‌ గాంధీని పర్యటింపజే స్తామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల హిమాచల్‌ ప్రదేశ్‌లో రెండు వేలు, ఉత్తరాఖండ్‌లో 20 వేల పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాయితీలు లభించాయని చెప్పారు. కేంద్రంలో 10 ఏళ్లు బిజెపి, రాష్ట్రంలో టిడిపి, వైసిపి చెరో ఐదేళ్లు అధికారంలో ఉన్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేక పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సాధన సభకు సిపిఎం, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ తదితర పార్టీల నాయకులు హాజరవుతున్నారని చెప్పారు. అనంతరం వెలగపూడి రైతు దీక్షా శిబిరంలో మాట్లాడారు. కాంగ్రెస్స్‌ నాయకులు చిలకా విజరు కుమార్‌, కె.సురేష్‌, కె.గాంధీ, కె.బాబు, రైతు జెఎసి నాయకులు డి.రామారావు, జి.స్వరాజ్యరావు, పి.సుధా కరరావు, జె.చలపతిరావు, కె.అప్పారావు పాల్గొన్నారు.

➡️