తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

Jan 31,2024 00:21

మాట్లాడుతున్న కమిషనర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
తాగునీటి సరఫరాలో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఉపేక్షించబోమని, ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని నగర కమిషనర్‌ కీర్తిచేకూరి స్పష్టం చేశారు. నగరంలో తాగునీటి సరఫరా, పైప్‌లైన్ల మరమ్మతులపై ఎస్‌ఇ, ఇంజినీరింగ్‌ అధికారులతో కమిషనర్‌ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా రిజర్వాయర్ల వారీగా ఇంజినీరింగ్‌ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేసుకోవాలన్నారు. కలుషిత నీరు సరఫరా కాకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తక్కెళ్లపాడు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌లో ఎస్‌ఈ, ఈఈలు ఉండవల్లి నుండి వచ్చే నీటి సరఫరా, ఫిల్టరేషన్‌, ఆలం, క్లోరినేషన్‌ లను నేరుగా పరిశీలించాలని, బిఆర్‌ స్టేడియం రిజర్వాయర్‌ దగ్గర పైప్‌లైన్‌ లీకు పనులను పూర్తి చేసినందున, బిఆర్‌ స్టేడియం రిజర్వాయర్‌, నల్లచెరువు రిజర్వాయర్ల ఏఈలు, డిఈఈలు త్రాగునీటి సరఫరా పునరుద్ధరణ భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విలీన గ్రామాలకు తాగునీటిని అందించడానికి అమత్‌-2పై సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డిపిఆర్‌), సంగం జాగర్లమూడి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌పై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ నిర్వహణపై ఆయా విభాగ అధికారులతో సమీక్షించారు. నగరంలో 24/7 తాగునీటి సరఫరా అందించేందుకు రెండు జోన్లను ట్రయిల్‌ రన్‌ కోసం ఎంపిక చేయాలని ఎస్‌ఇని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ (ఎఫ్‌ఏసి) సుందర్రామిరెడ్డి, ఈఈలు కోటేశ్వరరావు, శ్రీనివాస్‌, డిఈఈ రఫిక్‌, ఏఈ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

➡️