తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయండి -సిఎస్‌ ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంతో పాటు, అమలుకు సిద్దంగా ఉండాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అదికారులను ó ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం కరువు, విపత్తుల నిర్వహణ, తదనంతర చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ వివిధ రక్షిత మంచినీటి పథకాలు, ఇతర తాగునీటికి సంబంధించి అన్ని అవకాశాలను పూర్తిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తీర ప్రాంత మండలాల్లోని గ్రామాలు, గిరిజన మారుమూల ప్రాంతాల్లోని ఆవాసాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది క లుగకుండా తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో మిచౌంగ్‌ తుఫాన్‌కు దెబ్బతిన్న పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి రహదారుల మరమ్మతు పనులను వేగవంతంగా చేపట్టేందుకు కేంద్రం నుంచి రావాల్సిన కరువు స హాయ నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మిచౌంగ్‌ తుఫాన్‌ తర్వాత ఎక్కడైనా పశువులకు దాణా కొరత ఉందా? అని సిఎస్‌ ఆరా తీశారు. ప్రస్తుతం దాణా కొరత లేదని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గన్న వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. మిచౌంగ్‌ తుఫాన్‌లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇతర పరిహారానికి సంబంధించి కేంద్రం నుంచి ఈనెలలో నిధులు వచ్చే అవకాశం ఉందని సిఎస్‌ తెలిపారు. కరువు ప్రభావిత మండలాలు, ఇతర ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పిఆర్‌ అండ్‌ ఆర్‌డి అధికారులను ఆదేశించారు. వీటితో పాటు విపత్తుల నిర్వహణ, కరువు చర్యలకు సంబంధించి వివిధ అంశాలపై సిఎస్‌ సమీక్షించారు.

➡️