తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు

ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు

ప్రజాశక్తి – మొగల్తూరు

వేసవిలో తాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నామని చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని ముత్యాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రూ.42.80 లక్షల జల జీవన్‌ మిషన్‌ నిధులతో చేపట్టిన తాగునీటి పైపులైన్ల అభివృద్ధి పనులకు ఆయన ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో పైపులైన్లు నిర్మించి 30 సంవత్సరాలు పైబడి శిథిలావస్థకు చేరాయని, ఈ నేపథ్యంలో పైపులైన్లు మారుస్తున్నామని తెలిపారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకు, దానికి కావాల్సిన కొత్త పైపులైన్‌కు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని ముత్యాలపల్లిలో 60 వేల లీటర్ల తాగునీటి ట్యాంకును ప్రారంభించామన్నారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నదే ప్రభుత్వం ఆలోచనని తెలిపారు. గ్రామంలోని గదల్లవంపు, చింతరేవు, ముత్యాలపల్లి, ఎస్‌సి కాలనీలో రూ.43 లక్షలతో పైప్‌లైన్‌ నిర్మాణంతోపాటు 600 కుటుంబాలకు కొత్తగా కుళాయి కనెక్షన్‌ ప్రభుత్వం ఇవ్వ నుందన్నారు. నియోజకవర్గంలో రూ.65 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 45 గ్రామాల్లో జల జీవన్‌ మిషన్‌ ద్వారా పనులు మొదలు పెట్టగా, కొన్ని పనులు పూర్తయ్యాయని, కొన్ని పనులు జరుగుతున్నాయని, కొన్నింటికి టెండర్లు పిలిచామని తెలిపారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌లోపు పనులన్నీ పూర్తి చేసి ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో శాశ్వత పనులను చేసి ప్రతి గ్రామానికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. ముత్యాలపల్లిలో రూ.70 లక్షలు రూపాయలు ఇంటర్నల్‌ రోడ్డుకు నిధులు మంజూరు చేయగా రూ.30 లక్షలతో రోడ్లు నిర్మించామన్నారు. మిగతా రూ.40 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సిసి రోడ్లు నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి తిరుమాని బాపూజీ, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు అండ్రాజు చల్లారావు, సర్పంచి కొప్పనాతి పల్లయ్య, నాయకులు కర్రి ఏసు, రేవు రాంబాబు, పొన్నమండ సూరయ్య, కొల్లాటి సోమరాజు, కొల్లాటి రామారావు, కొల్లాటి నాగరాజు, మైల నాగరాజు, కడలి నాగరాజు, బొక్క పెద్దిరాజు పాల్గొన్నారు.

➡️