తనిఖీలు పెంచాలి : కలెక్టర్‌

Feb 13,2024 21:09

ప్రజాశక్తి – పార్వతీపురం : సాధారణ ఎన్నికల నేపద్యంలో గంజాయి, మద్యం, డగ్స్‌, డబ్బు రవాణాను నిరోధించేందుకు తనిఖీలు పెంచాలని జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరు కార్యాలయంలో నార్కో కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా నియంత్రణకు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పోలీసు, ఎక్సైజ్‌, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని కోరారు. ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో మూఢు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గంజాయి, మద్యం, డగ్స్‌, డబ్బు రవాణాను నిరోధించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గంజాయి రవాణా చేసే వారిపై కఠినమైన సెక్షన్లు అమలవుతాయని, బెయిలు కూడా రాదని అన్నారు. కావున ఎవరూ ఆటువంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనవద్దని తెలిపారు. అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అక్రమ సంపాదనకు ఆశపడి కేసుల్లో ఇరుక్కోవద్దని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిని మాదకద్రవ్యాలు బారినపడకుండా కాపాడుకోవాలని తెలిపారు. సమావేశంలో జెసి ఆర్‌.గోవిందరావు, డిఎఫ్‌ఒ జి.ప్రసూన, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి. కేశవనాయుడు, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాధం, జిల్లా ప్రజారవాణా అధికారి టి.వి.ఎస్‌.సుధాకర్‌, ఆర్‌టిఒ సి.మల్లిఖార్జున రెడ్డి, బిసి వెల్ఫేర్‌ అధికారి ఎస్‌. కృష్ణ, ఎక్సైజ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.అనుమతి లేకుండా ఇసుక త్రవ్వకాలు జరుపకూడదుఅనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరుపకూడదని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. సుప్రీంకోర్టు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపకూడదని తెలిపారు. అనుమతులు పొందిన రీచ్‌ల్లో కూడా పర్యావరణానికి సంబంధించిన అన్ని అనుమతులు పొందాకే ఇసుక తవ్వకాలు జరుపాలని తెలిపారు. జనవరి 4న జిల్లాలో నాలుగురీచ్‌లకు అనుమతులిచ్చామని, వారు రాష్ట్ర స్థాయిలో అన్ని అనుమతులు పొందాకే ఇసుక తవ్వకాలకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నదీపరివాహన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి గతేడాది 50 కేసులు, ఈ ఏడాది ఇప్పటివరకు 2 కేసులు నమోదు నమోదయ్యాయన్నారు.

➡️