తగ్గిన రబీ విస్తీర్ణం

Feb 20,2024 21:33

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : రబీ పంటల సాగు విస్తీర్ణం జిల్లాలో ఏటా తగ్గుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు పెరిగిన మదుపు, కనీస మద్ధతు ధర కల్పించకపోవడం, దళారుల దోపిడీ వంటి కారణాలవల్ల రెండో పంటలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది రబీ పంటల సాగు దాదాపు ముగిసింది. ఈ సీజన్‌లో మొక్కజొన్న, మినుములు, పెసలు ఆ తరువాత స్థానంలో రాగులు, వరి సాగవుతాయి. ఇతర అపరాలు, చిరుధాన్యాలు అంతంత మాత్రంగానే సాగవుతాయి. రబీ సాధారణ విస్తీర్ణం 1,62,305 ఎకరాలు కాగా, ఈ ఏడాది 1,00,621 ఎకరాల్లో మాత్రమే సాగైంది. గత ఏడాదితో పోలిస్తే 28,775 ఎకరాలు, సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 61684 ఎకరాల విస్తీర్ణం తగ్గింది. కేవలం 62శాతం విస్తీర్ణంలోనే సాగు కనిపిస్తోంది. వర్షాలు అనుకూలించకపోవడం, వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక సాగును ఒక్కసారి గమనిస్తే…. అత్యధికంగా మొక్కజొన్న 43,933 ఎకరాల్లో సాగైంది. ఆ తరువాత స్థానంలో మినుములు 34,649 ఎకరాలు, పెసలు 13,805 ఎకరాలు, రాగులు 24,88 ఎకరాలు, వరి 796ఎకరాల్లో సాగయ్యాయి. పంటల బీమా సదుపాయ ప్రక్రియలో భాగంగా ఇకెవైసి నమోదుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈనెల 23వ తేదీలోపు రైతులంతా స్థానిక ఆర్‌బికెలకు వెళ్లి వేలిముద్రలు (ఇకెవైసి) నమోదు చేసుకోవాల్సి ఱంటుంది. ఈ మేరకు నమోదు చేసుకున్నవారికి మాత్రమే పంటల బీమా వర్తించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 1,00,621 ఎకరాల రబీసాగులో 55,813 మంది రైతులకు చెందిన 94,719 ఎకరాల పంటలను వ్యవసాయ శాఖ సిబ్బంది ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేశారు. వీరిలో కేవలం 44,843 మంది రైతులు మాత్రమే ఇకెవైసి నమోదు చేయించుకున్నారు. మిగిలిన 10,970 మంది ఈనెల 23వ తేదీలోపు నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వీరిలో 3,352 మంది రైతులు లీగల్‌, ఆధార్‌ సాంకేతిక సమస్యలతో ఉన్నట్టుగా సమాచారం. ఇటువంటి వారంతా స్థానిక తహశీల్దార్‌, మండల వ్యవసాయ శాఖ అధికారి అంగీకారపత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుంది. ఆ తరువాతే ఇకెవైసి ప్రక్రియ పూర్తి అవుతుంది. సహాయ సహకారాలకోసం రైతులు తమను సంప్రదించవచ్చని ఆర్‌బికె సిబ్బంది, మండల వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పంటల బీమాతోపాటు పంటల కొనుగోలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి వ్యవసాయ, ఉద్యాన రంగాలకు చెందిన పథకాలు పొందాలంటే ఇ-క్రాప్‌ బుకింగ్‌తోపాటు ఇకెవైసి నమోదు కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మన జిల్లాలో వరి, మొక్కజొన్న, పెసలు, మినుము పంటలకు మాత్రమే బీమావర్తించే విధంగా ప్రభుత్వం నోటిఫైడ్‌ చేసింది.

➡️