డెంగ్యూ వ్యాక్సిన్‌ తయారీలోకి బిఇజపనీస్‌ తకెడతో భాగస్వామ్యం

Feb 27,2024 21:15 #Business

ఏడాదికి 5 కోట్ల డోసుల ఉత్పత్తి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ : బయోలాజికల్‌ ఇ (బిఇ) డెంగ్యూ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. జపనీస్‌ ఔషద ఉత్పత్తుల కంపనీ తకెడతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాక్సిన్లను తయారు చేయనున్నట్లు తెలిపింది. తొలుత ఏడాదికి 5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనుంది. 2030 నాటికి ఏడాదికి 10 కోట్ల డోసుల ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐడిటి బయోలాజిక జిఎంబిహెచ్‌ భాగస్వామ్యంతో తకెడ ప్రస్తుతం జర్మనీలోని ప్లాంట్‌లో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది. తకెడా ప్రస్తుతం ‘క్యూడెంగ’ పేరుతో డెంగ్యూ వ్యాక్సిన్లను అభివృద్థి చేస్తోంది. దీనికి ప్రపంచంలోని 30 దేశాల్లో అనుమతి ఉంది. యూరప్‌, బ్రిటన్‌, ఇండోనేసియా, థాయిలాండ్‌ తదితర దేశాల్లోని ప్రయివేటు మార్కెట్‌లో పిల్లలకు, పెద్దలకు ఈ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. అర్జెంటినా, బ్రెజిల్‌లో ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. 0.5 ఎంఎల్‌ కలిగిన ఈ డోస్‌ను మూడు నెలల్లో రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది.”సంక్లిష్టమైన వ్యాక్సిన్‌ల తయారీ ప్రపంచంలోనే బలమైన భాగస్వాములను ఆకర్షించే ఒక ఇన్‌స్టిట్యూట్‌ను సృష్టించడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వాలనే మా లక్ష్యానికి ఇది నిదర్శనం.” అని బిఇ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల పేర్కొన్నారు. ”డెంగ్యూ నివారణకు తకెడ దీర్ఘకాల లక్ష్యంలో భాగంగా ప్రమాదంలో ఉన్న వారికి విస్తృతంగా టిఎకో003 వ్యాధి నిరోధక టీకాలను అందుబాటులో ఉంచాలని నిర్దేశించుకున్నాం. తద్వారా రోగులు వ్యాధి నిరోధకత ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గతేడాది మేము ప్రయివేటు మార్కెట్‌లలో విజయవంతంగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇప్పుడు కొన్ని పబ్లిక్‌ ప్రోగ్రామ్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చాము. మరింత విస్తృత ప్రజారోగ్య ప్రభావానికి మద్దతు ఇవ్వడానికి వివిధ భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాము.” అని తకెడ గ్లోబల్‌ వ్కాక్సిన్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ గ్యారీ డుబిన్‌ పేర్కొన్నారు.

➡️