టెక్నాలజీ పురోగతితోనే దేశాభివృద్ధి

Feb 28,2024 22:31

జెవివి జిల్లా కార్యదర్శి హరి  

                      హిందూపురం : సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పురోగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని జెవివి కార్యదర్శి డాక్టర్‌ ఇటి. రాంమ్మూర్తి అన్నారు. బుధవారం లేపాక్షి మండలం కొండురు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జెవివి ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెవివి నాయకులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు కొత్త తరం సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసే ప్రయత్నం నిరంతరం జరుగుతునే ఉండాలన్నారు. విద్యార్థులకు సాంకేతికతతోపాటు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందించడంలో సైన్స్‌ ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మూడనమ్మకాలకు, ఛాందస బావాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం గోపీ, జెవివి నాయకులు రామకృష్ణ, చైతన్య గంగిరెడ్డి, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నారాయణ ఒలింపియాడ్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ ప్రయోగాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల ఎజిఎం రమేష్‌, ప్రిన్సిపాల్‌ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. పెనుకొండ : జన విజ్ఞాన వేదిక పెనుకొండ జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్‌డే, జెవివి 36 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ అధ్యక్షులు నబీ మేజిక్‌ షో నిర్వహించారు. శాస్త్రీయత దాని ప్రాముఖ్యత, మూఢనమ్మకాల నిర్మూలన గురించి వక్తలు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కేశవ రెడ్డి, వైస్‌ ప్రిన్సపాల్‌ జయప్ప, జెవివి జిల్లా కార్యదర్శి హరి, జోన్‌ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్‌, లెక్చరర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కదిరి టౌన్‌ : మూఢనమ్మకాలు తగ్గాలంటే శాస్త్ర ప్రచారమే సరైన మార్గమని, ఇందుకోసం జనవిజ్ఞాన వేదిక విద్యార్థులకు ప్రతి ఏడాది సైన్స్‌ చెకుముకి పరీక్షలు, సామాన్య ప్రజానీకంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య పరుస్తోందని జనజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు బి నర్సారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కదిరి మండలం పట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని జన విజ్ఞాన వేదిక కదిరి శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా నరసారెడ్డి అబ్బురపరిచే ఇంద్రజాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం సుకుమార్‌ రెడ్డి, ఉపాధ్యాయులు నాగభూషణం, రమేష్‌, రవీంద్ర నాయక్‌ పాల్గొన్నారు.

➡️