టిక్కెట్లు… ఇక్కట్లు

టిడిపి ఈ నెల 22న ప్రకటించిన మూడో జాబితాలో

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి (ఫైల్‌)

రెందు చోట్ల కొత్త అభ్యర్థులకు టిడిపి సీట్లు

వేచి చూసే ధోరణిలో ఇన్‌ఛార్జీలు

ఎన్నికల్లో సహకారంపై సందేహమే

ఎంపీ సీటుపై పడనున్న ప్రభావం

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సీట్లలో టిడిపి మూడు విడతల్లో కలిపి ఏడు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల సీటును ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించినట్లు సమాచారం. తొలి రెండు జాబితాలు ఇబ్బంది కలిగించకపోయినా, తాజాగా మూడో జాబితా మాత్రం అసంతృప్తి జ్వాలలను రాజేసింది. శ్రీకాకుళం, పాతపట్నం స్థానాల్లో కొత్త అభ్యర్థుల ప్రకటన పార్టీలో చిచ్చురేపింది. సీనియర్లను పక్కన పెట్టడం, ప్రత్యేకించి గుండ కుటుంబంపై ఉన్న సానుభూతితో టిడిపిపై ప్రజల్లో కొంత విముఖత కనిపిస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు మునుపు టిడిపిలో ఉన్న ఊపు కాస్తా తగ్గడంతో పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

టిడిపి ఈ నెల 22న ప్రకటించిన మూడో జాబితాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అందులో రెండు చోట్ల మార్పులు చేసింది. ఇప్పుడు ఆ మార్పులే టిడిపికి చేటు తెచ్చేలా కనిపిస్తున్నాయి. పలాస స్థానానికి గౌతు శిరీష పేరును ఖరారు చేయగా, శ్రీకాకుళానికి గొండు శంకర్‌కు, పాతపట్నం సీటును మామిడి గోవిందరావుకు కేటాయించింది. ఈ రెండు స్థానాల్లో పార్టీ ఇన్‌చార్జీలుగా ఉన్న గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణకు పార్టీ మొండి చేయిచూపింది. ఈ రెండు నియోజకవర్గాలకూ చాలా అంశాల్లో సారుప్యం కనిపిస్తోంది. పార్టీ ఓటమి తర్వాత 2019 నుంచి పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. పార్టీ ఇచ్చిన పిలుపుల మేరకు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు, చంద్రబాబు, లోకేష్‌ సభల నిర్వహణ వంటి ఖర్చులను వారే భరించారు. సూపర్‌ సిక్స్‌ పథకం పేరుతో ఇంటింటికీ వెళ్లారు. చంద్రబాబు అరెస్టు తర్వాత వీరి ఆధ్వర్యాన్న రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టిక్కెట్ల కేటాయింపు దగ్గరకొచ్చేసరికి అధిష్టానం ఆ కార్యక్రమాలతో సంబంధంలేని కొత్త వారికి కేటాయించడాన్ని పార్టీ శ్రేణులు జీర్జించుకోలేకపోతున్నాయి. ఇన్‌ఛార్జీలు కొంత వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నా… కార్యకర్తలు మాత్రం తగ్గేదేలా అన్నట్లు ఉన్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేయాలని ఇన్‌ఛార్జీలపై ఒత్తిడి తెస్తున్నారు. డొనేషన్లు వేసుకునైనా గెలిపించుకుంటామని నాయకులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చుకు వెనుకడుగు వేసేనందుకేనా?ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో రెండు చోట్ల ఇన్‌ఛార్జీలకు టిక్కెట్లు దక్కకపోవడమే ఒక ఉదాహరణ. టిక్కెట్ల ప్రకటనకు ముందుకు గుండ నివాసానికి వచ్చిన టిడిపి పరిశీలకుడొకరు ఎంత ఖర్చు చేయగలరని లక్ష్మీదేవిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆమె ఒక అంకె చెప్పి అంతకుమించి తాను వెచ్చించలేనని చెప్పడంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. తర్వాత విడుదలైన జాబితాలో ఆమె పేరు లేదు. ఇదే అనుభవం పాతపట్నం ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణకు ఎదురైంది. ఆయన కూడా ఏదో నంబరు చెప్పగా, చాలదని చెప్పినట్లు తెలిసింది. తర్వాత ఆయన పేరూ లేదు.టిడిపికి చేటు తెచ్చిన ఐవిఆర్‌ఎస్‌ సర్వే అభ్యర్ధుల ప్రకటన విషయంలో చంద్రబాబు ప్రధానంగా ఐవిఆర్‌స్‌ సర్వేనే నమ్ముకున్నట్లు తెలిసింది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే అభ్యర్థులను ఎంపిక చేశామని ఒకట్రెండు సార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ సర్వేనే టిడిపి దెబ్బతీసేలా కనిపిస్తోంది. టిడిపి చేపట్టిన సర్వే వైసిపి కేడర్‌కూ చేరింది. టిడిపి నుంచి ఎవరు పోటీ పడితే తాము తేలిగ్గా గెలవగలమో గుర్తించి వారికే ప్రాధాన్యమిచ్చారు. దీంతో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో గొండు శంకర్‌, మామిడి గోవిందరావుకు సర్వేలో అధిక శాతం మంది ప్రాధాన్యమివ్వడంతో వారికే సీట్లు కేటాయించినట్లు చర్చ నడుస్తోంది.అచ్చెన్న రాజకీయ క్రీడటిక్కెట్ల కేటాయింపులో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆడిన రాజకీయ క్రీడ వల్లే తమకు సీట్లు రాలేదని ఇన్‌ఛార్జీలు బహిరంగానే ఆరోపణలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కాలని చాలాకాలం నుంచి అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నా రని గుండ లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అసమ్మతిని రాజేసి చివరకు టిక్కెట్‌ రాకుండా అడ్డుకున్నారని మండిపడుతున్నా రు. పాతపట్నంలో కలమట వెంకటరమణకు టిక్కెట్‌ దక్కకుండా అచ్చెన్నాయుడు చేశారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు.ఎంపీ సీటుపై ప్రభావంజిల్లాలో రెండు చోట్ల అభ్యర్థుల మార్పుతో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కింజరాపు రామ్మోహన్‌నాయుడుపై పడనుందనే చర్చ నడస్తోంది. ఇండిపెండెంట్లుగా పోటీచేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జీలపై కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇన్‌ఛార్జీలు మాత్రం దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారు. చివరి క్షణంలోనైనా తమకు బి-ఫారమ్‌ దక్కొచ్చని అనుకుంటున్నారు. నిర్ణయం మార్చుకోవాలంటూ పార్టీ అధిష్టానానికి కొంత సమయం ఇచ్చారు. అభ్యర్థులు వారే ఫైనల్‌ అయితే మాత్రం ఈ రెండు నియోజకవర్గాల్లో టిడిపికి ఓటమి తప్పదని చర్చ నడుస్తోంది. ఇండిపెండెంట్లుగా పోటీచేస్తే టిడిపి ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇండిపెండెంట్లుగా పోటీ చేయకుండా తటస్థంగా ఉన్నా నష్టం తప్పేలా లేదు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వల్లే తమ నేతలకు టిక్కెట్‌ రాలేదనే కోపంతో ఉన్న ఆ రెండు నియోజకవర్గాలోని పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థినీ వ్యతిరేకించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి టిడిపి ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టనుందో వేచి చూడాల్సి ఉంది.

➡️