జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి : పిఒ

వైద్యునితో మాట్లాడుతున్న పిఒ అభిషేక్‌

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ ఆదేశించారు.కిల్లోగుడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా జ్వరాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో మందులు నిల్వలను ఉంచుకోవాలని సూచించారు. త్వరలోనే దోమల మందు పిచికారీ పనులు చేపడతామన్నారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి వైద్య సేవలు అందించాలని సూచించారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద కనబరచాలని ఆదేశించారు. సాగర గ్రామంలో రూ 5.90 లక్షలతో ఆధునీకరించిన ప్రాధమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం, ఐటిడిఏ అందిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వనియోగం చేసుకుని పిల్లలను ఉన్నతంగా చదివించాలని తలిదండ్రులకు సూచించారు. విద్యతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇఇ కె.వేణు గోపాల్‌, ఎఇ అభిషేక్‌, సాగర సర్పంచ్‌ తవుడమ్మ, స్వఛ్చాంద్ర కార్పోరేషన్‌ డైరెక్టర్‌ శోభా సోమేశ్వరి, ఎంపిటిసి దేవదాసు పాల్గొన్నారు.

➡️