జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్‌ చట్టాలు

Feb 25,2024 08:26 #New criminal laws

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్‌)-2023, భారతీయ సాక్ష్య బిల్లు(బిఎస్‌)-2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)- 2023లు 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సిఆర్పిసి) కోడ్‌ -1973, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఎ)- 1872 స్థానాలను భర్తీ చేయనున్నాయి. వీటికి పార్లమెంట్‌ ఆమోదం తరువాత, డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఆ తరువాత చట్టాలుగా మారాయి. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలకు కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏడేళ్లు, అంతకు పైబడి శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్‌ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నాయి. భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా, ఐపిసిలో ఉన్న 19 నిబంధనలను తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనలలో జరిమానా పెంచగా.. 23 నేరాలలో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా మార్చారు. నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకోవాలి: ఎఐ ఆర్టిడబ్ల్యుఎఫ్‌జూలై 1నుండి కొత్త క్రిమినల్‌ చట్టాలు అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్టిడబ్ల్యుఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. ఇది తన హామీ నుండి వెనక్కి మళ్లి దేశ ప్రజలను మోసం చేయడమేనని, డ్రైవర్లను బాధితులుగా చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌. లక్ష్మయ్య శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘం ఆఫీస్‌ బేరర్లు, వర్కింగ్‌ కమిటీ సమావేశాలు ఫిబ్రవరి 27, 28 తేదీలలో తిరువనంతపురంలో జరగనున్నాయని, కార్యాచరణ కార్యక్రమంతో సహా ఈ అంశంపై చర్చిస్తామని అన్నారు. రోడ్డు రవాణా కార్మికులు, భాగస్వామ్యదారులందరూ నోటిఫికేషన్‌ను రద్దు చేయడానికి కార్యాచరణ కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని ఎఐఆర్టిడబ్ల్యుఎఫ్‌ విజ్ఞప్తి చేస్తుందని అన్నారు.

➡️