జీడి కనీస మద్దతు ధర రూ.200కు పెంచాలి

Feb 12,2024 21:04

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జీడి కనీస మద్దతు ధర కేజీ రూ.200కు పెంచి గిరిజనుల నుంచి జిసిసి నేరుగా కొనుగోలు చేయాలని చెముడుగూడ ఎంపిటిసి మండంగి రమణ అధికారులను కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపిపి కె.దీనమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ప్రతి ఏటా గిరిజనుల ప్రధాన జీవనాధారమైన జీడి పంటకు కనీస మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. నాలుగేళ్లుగా కారు మబ్బులు వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గుతూ వస్తుందన్నారు. చేతికి వచ్చిన కొద్ది పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ ఏడాది చింతపండు కేజీ రూ.60, పసుపు కేజీ రూ.150, కొండ చీపుర్లు రూ.120 కు కొనుగోలు చేయాలని కోరారు. గుమ్మలక్ష్మీపురంలో రక్త నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రమణ డిమాండ్‌ చేశారు. స్పందించిన వైద్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్‌అండ్‌ బి, విద్య, వైద్య, గృహ నిర్మాణం, ఐసిడిఎస్‌ తదితర శాఖలపై చర్చ జరిగింది. సభ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఎంపిపి అధికారులను కోరారు. అలాగే తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి మండల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జడ్పిటిసి రాధిక, వైస్‌ ఎంపిపిలు నిమ్మక శేఖర్‌, ఎం.లక్ష్మణరావు, బిసి రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గిరిబాబు, ఎంపిడిఒ జగదీష్‌ కుమార్‌, డిప్యూటీ తహశీల్దార్‌ రాజేంద్ర, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

➡️