జామకు వైరస్…

Dec 19,2023 16:49

దెబ్బతిన్న జామకాయలను రోడ్లపై పడేస్తున్న రైతు

జామకు వైరస్…
– ఆందోళనలో రైతులు
– దెబ్బతిన్న జామకాయలను రహదారిపై పడేస్తున్న వైనం
– కొనేందుకు ముందుకు రాని వ్యాపారులు
ప్రజాశక్తి – చాగలమర్రి
జామ తోట లకు వైరస్ సోకింది. వైరస్ వల్ల తెగుళ్ల బారినపడి పంట దెబ్బతిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పండు ఈగ వల్ల కాయలు దెబ్బతినడంతో వాటిని తొలగించి రోడ్డుపై పడే స్తున్నారు. చాగలమర్రి గ్రామానికి చెందిన కౌలు రైతులు యాసిన్ మూడెకరాలు, ఉసేన్ బాషా రెండెకరాల్లో పండిన జామ కాయలను కూలీల ఖర్చు కూడా రాకపోవడంతో రహదారులపై పడేశారు. పండు ఈగను కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్లు తొడగిన పలితం లేదు. పండు ఈగ అధికం కావడంతో జామ కాయలకు రంధ్రాలు పడి దెబ్బతినడంతో వ్యాపారులు కూడా కొనేందుకు ముందుకు రావడం లేదు. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టామని, 25 కేజిల బాక్సు రూ.150 కూడా పలకడం లేదని, దెబ్బతిన్న జామకాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. సాధారణంగా 25 కేజిల బాక్సు రూ.500 ధర పలికేది. ప్రస్తుతం ధర భారీగా పడి పోయింది. పండు ఈగ వల్ల జామ కాయలకు రంద్రాలు పడి ఎర్రబారడటంతో దెబ్బతిన్న కాయలను తొలగిస్తున్నామని రైతులు తెలిపారు. జామ తోటలు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు కూడా ఇవ్వడం లేదన్నారు. పండు ఈగ నివారణకు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఉద్యాన పంటలకు కల్పించే రాయితీలు ఇవ్వాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

 

➡️