జాప్యం చేయకుండా జిఒలను విడుదల చేయాలి

Jan 28,2024 21:36

ప్రజాశక్తి -పార్వతీపురంటౌన్‌ : మున్సిపల్‌ కాంట్రాక్టర్‌, ఔట్‌సోర్సిం గ్‌ ఉద్యోగుల సమస్యలపై 16 రోజుల పాటు జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం కుదిరిన ఒప్పందాలకు వెంటనే జీవోలు విడుదల చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు మాట్లాడారు. సమ్మె విరమించి 15 రోజులు గడుస్తున్నా చేసుకున్న ఒప్పందాలకు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం నేటికీ జారీ చేయకుండా జాప్యం చేస్తుందని అన్నారు. అనేక జీవోలు ఇంకా ఫైనాన్స్‌ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల సమ్మె కాలపు జీతం ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని, డ్రైవర్లకు రూ.24,500 వేతనానికి, దహన సంస్కార ఖర్చులు రూ.20వేలు చెల్లింపునకు, డ్యూటీలో ఉంటూ చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారం, పర్మినెంట్‌ సిబ్బందికి బకాయి, సరెండర్‌ లీవ్‌లో చెల్లింపులకు, స్కూల్‌ పేపర్లను కనీస వేతనం పెంచుతూ 23శాతం వేతనాలు పెంచేందుకు అంగీకరించిన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నామని తెలిపారు. అలాగే ఇంజనీరింగ్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది కమిటీ వెంటనే పని ప్రారంభించి, స్కిల్డ్‌ సొసైటీ ద్వారా వేతనాలు అమలుపర్చే ప్రక్రియను ప్రారంభిం చాలన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నా మని తెలిపారు. క్లాప్‌ ఆటో డ్రైవర్లు సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సమావేశం వేసి సమస్య పరిష్కరించాలని, లేకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతాని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.రమణారావు, కోశాధికారి జివి రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విరమింప చేసినాడు ఉన్న శ్రద్ధ, సమస్యలకు జీవోలు ఇవ్వడంలో కనిపించడంలేదని, ప్రభుత్వం చిత్త శుద్ధి మాటల ద్వారా కాకుండా, చేతల ద్వారా చూపించి నిరూపించుకోవాలని, లేకుంటే కార్మికులు చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం బాధ్యత అవుతుందని తెలిపారు. అనంతరం 16 రోజుల సమ్మె అనుభవాలను కార్మికులు, ఉద్యోగులు వివరిస్తూ ముద్రించిన ప్రచార పత్రాన్ని విడుదల చేశారు. సాలూరు, పార్వతీపురం, పాలకొండ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్రావు, రాముడు, సింహాచలం, శివ, సంజీవి, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ టి.ఇందూ, కో కన్వీనర్‌ జి.స్వప్న పాల్గొన్నారు.

➡️