జలుబు, గొంతునొప్పి, జ్వరం..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

శీతాకాలం చలిగాలులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా చలిపులి జిల్లా ప్రజానీకాన్ని వణికిస్తోంది. రెండు జిల్లాల్లోనూ రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో పగలు, రాత్రుళ్లు సైతం ఫ్యాన్‌ వేయాలంటేనే వణికిపోతున్న పరిస్థితి ఉంది. వృద్ధులు, పిల్లలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో జనాన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. జలుబు, గొంతునొప్పి, జ్వరం, కఫం వంటి సమస్యలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాల్లో ప్రతి కుటుంబంలోనూ ఒకరిద్దరు జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. రోజులు తరబడి అనారోగ్య సమస్యలు తగ్గడం లేదు. దీంతో ఆసుపత్రులు, మెడికల్‌ స్టోర్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా ప్రయివేటు ఆసుపత్రుల్లో పరీక్షల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సాదాసీదా జ్వరానికి కూడా రూ.నాలుగైదు వేలు పిండేస్తున్నారు. ఒకపక్క తీవ్రమైన చలి, మరోపక్క జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు సైతం జనాలతో నిండిపోతున్నాయి. వేడినీళ్లు తాగడం, ఆవిరి పట్టడం వంటివి చేస్తూ ఉపశమనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాపిస్తుందనే ప్రచారం జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏలూరు జిల్లాలో గడిచిన వారం రోజుల్లో ఒక కరోనా కేసు నమోదైంది. అయినప్పటికీ కరోనాపై జరుగుతున్న ప్రచారంతో జనంలో ఆందోళన నెలకొంది. జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కరోనాకు దగ్గరగా ఉండటంతో అందరినీ భయం వెంటాడుతోంది. కరోనా కొత్త వేరియంట్‌తో ఇబ్బందిల లేదని, ఇది సాధారణంగా వచ్చి తగ్గిపోతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ జనాలను మాత్రం కరోనా భయం వీడటం లేదు. సాయంత్రం ఆరు తర్వాత చలికి బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే చెవులకు, శరీరానికి చలిగాలులు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట ప్రయాణాలు మానుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చలిగాలుల ప్రభావం వృద్ధులు, పిల్లలపైనే ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో త్వరగా వృద్ధులు, పిల్లలను అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్యులు చెబుతున్నారు. ఆహారం కూడా వేడిగా తినాలని సూచిస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌ వంటి శీతలపానీయాల జోలికిపోకూడదని చెబుతున్నారు. జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నన్నప్పుడు సర్వసాధారణమని, కంగారు పడాల్సిన పనిలేదని అంటున్నారు. నాలుగైదు రోజులపాటు తగిన జాగ్రత్తలు తీసుకుని, మందులు వాడితే తగ్గిపోతుందని, ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. తుపాను ప్రభావంతో ఖరీఫ్‌ మాసూళ్లు పూర్తికాకపోవడం, దాళ్వా సాగుకు నారుమడులు వేయాల్సి రావడంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉదయం పొలం వెళ్లే వ్యవసాయ కూలీలు చలిగాలులకు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా అనారోగ్యం బారిన పడుతున్నారు. చలిగాలులతో వెంటాడే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యఆరోగ్యశాఖ ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. అప్పుడే ప్రయివేటు ఆసుపత్రుల్లో జరిగే దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

➡️