‘జయ జానకీ నాయక’ రికార్డు

Feb 23,2024 08:15 #movie, #sai srinivas

సామాజిక మాధ్యమాలు ఓటీటీల్లో తెలుగు సినిమా ‘జయ జానకీ నాయక’ సరికొత్త రికార్డును సాధించింది. ఏ భాషలో విడుదలైన సినిమా అయినా అది హిట్‌ అయితే ఇతర భాషల సినీ ప్రేమికులు ఆ మూవీని తమ వాచ్‌ లిస్ట్‌లో పెట్టేస్తున్నారు. ఈక్రమంలో ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు నిర్మాణ సంస్థలు ఓటీటీలు కూడా ఆ మూవీలను ఇతర భాషల్లోకి డబ్‌ చేసి, విడుదల చేస్తున్నాయి. అలా యూట్యూబ్‌లో విడుదలైన తెలుగు మూవీ ‘జయ జానకీ నాయక’ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రమూ సాధించని విధంగా ఏకంగా 800 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియాలోనే అత్యధిక మంది యూట్యూబ్‌లో వీక్షించిన చిత్రంగా నిలిచింది. బెల్లకొండ సాయి శ్రీనివాస్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఆగస్టు 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగులో మిశ్రమ స్పందనలకే పరిమితమైనా యాక్షన్‌ ప్రియులను బాగా అలరించింది. ఈ క్రమంలో ‘పెన్‌ మూవీ’ సంస్థ ‘జయ జానకీ నాయక కోహినూర్‌’ పేరుతో ఫిబ్రవరి 8, 2019న ఈ మూవీని హిందీలోకి డబ్‌ చేసి యూట్యూబ్‌ వేదికగా విడుదల చేసింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ కలిగిన పది సినిమాల్లో ఏడు తెలుగువే కావడం గమనార్హం. ఇందులో మూడు చిత్రాలకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించినవే. మొదటి స్థానంలో ‘జయ జానకీ నాయక కోహినూర్‌ (800 మిలియన్‌ వ్యూస్‌) ఉండగా, రెండో స్థానంలో ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో యశ్‌ నటించిన కేజీయఫ్‌ (772 మిలియన్‌ వ్యూస్‌) వేగంగా దూసుకెళ్తోంది. ఇక మూడో స్థానంలో సీతారామ్‌ (తెలుగులో దర్శకుడు తేజ తీసిన సీత – 643 మిలియన్‌ వ్యూస్‌) ఉంది.

➡️